బీజేపీకి వత్తాసు పలుకుతారా? | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి వత్తాసు పలుకుతారా?

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విద్యా సంస్థల బంద్‌ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాల్సింది పోయి బీజేపీకి వత్తాసు పలుకుతారా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం’ అని విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఏ, పీఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌బీ, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఐద్వా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద శాంతియుతంగా బంద్‌ నిర్వహించేందుకు వెళ్లిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును కూడా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలపగా, ప్రభుత్వ విద్యాసంస్థల వద్ద పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పృథ్వీ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్‌, పీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు అబ్దుల్‌ అలం, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి ఓబులేసు, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమేష్‌, ఏఐవైఎఫ్‌ నాయకుడు దుర్గాప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

రాయదుర్గంలో ఉద్రిక్తత

రాయదుర్గంటౌన్‌: నీట్‌ పేపర్‌ లీకేజీ, విద్యార్థులపై దాడులకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ శుక్రవారం రాయదుర్గంలో ఉద్రిక్తతకు దారి చేసింది. మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌(పీటీఎం)లు నిర్వహిస్తుండడంతో బంద్‌ చేయించేందుకు వచ్చిన ఏఐవైఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కావలి కొట్రేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ, పీడీఎస్‌యూ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలియజేశారు.

ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

అనంతపురంలో కేఎస్‌ఆర్‌ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు

స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెబుతాం

నీట్‌ లీకేజీపై విద్యార్థి నాయకుల ఆగ్రహం

విద్యా సంస్థల బంద్‌ విజయవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement