బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజునూరు జలాశయం (అప్పర్ తుంగా ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరడంతో అక్కడి అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఆ నీరంతా పరుగున వచ్చితుంగభద్ర డ్యాంలో చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 28 టీఎంసీల నీరు ఉంది. తాగునీటి అవసరాల నిమిత్తం వివిధ కాలువలకు 3,035 క్యూసెక్కులు వదులు తున్నారు. ఇన్నాళ్లూ నిరాశ పరిచిన వరద ఒక్కసారిగా పెరగడంతో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరుణుడి కరుణ కొనసాగి జలాశయం త్వరగా నిండాలని ఆకాంక్షిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.64 అడుగులతో 78.60 టీఎంసీల నీరు నిల్వ ఉండి 29,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 38,557 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
రైతులకు 2024 ఫసల్ బీమా పరిహారం!
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2024కు సంబంధించి ఫసల్‌బీమా పథకం కింద రైతులకు పరిహారం విడుదలైనట్లు తెలుస్తోంది. ఏయే పంటలకు వర్తింపజేశారు, ఎంత మంది రైతులున్నారు, ఎంత మొత్తం విడుదలైంది, వాతావరణ బీమా కింద ఏమైనా పరిహారం వచ్చిందా అనే వివరాలు తమకు ఇంకా అందలేదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతుల మొబైల్‌కు గురువారం మెసేజ్‌లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 2024 ఖరీఫ్ ఫసల్‌బీమా కింద పాక్షికంగా పరిహారం విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. దీనిపై బీమా కంపెనీలను సంప్రదించి స్పష్టత తీసుకుంటామని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ప్రతి ఎకరాకూ బీమా వర్తించాలి
అనంతపురం అర్బన్: సాగు చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ, క్రాప్ ఇన్సూరెన్స్ (డీఎల్‌ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంటల బీమాకు ఈనెల 31 వరకు అవకాశం ఉందన్నారు. రైతులందరూ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద ఇప్పటి వరకు 38,416 హెక్టార్లకు సంబంధించి 25,621 మంది,దిగుబడి ఆధారిత బీమా కింద 32,514 హెక్టార్లకు 19,908 మంది రైతులు నమోదు చేసుకున్నారన్నారు. ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు.. ఎంత మంది బీమా నమోదు చేసుకున్నారు.. వేరుశనగ నుంచి ఇతర పంటలకు మారిన రైతులు ఎంత మంది తదితర వివరాలతో నివేదిక అందించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఎల్‌డీఎం మారుతి శ్రీనివాసులు, ఏడీఏలు, బ్యాంకర్లు, బీమా ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వెనక్కిరాని ఈఎఫ్‌లు
2.40 లక్షలు
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పొడిగించిన షెడ్యూల్ ప్రకారం తొలి అంకమైన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 20,38,523 మంది ఓటర్లు ఉండగా, వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. పది రోజులు గడువు పొడిగించిన తరువాత కొనసాగిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో రోజురోజుకూ ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ సంఖ్య తగ్గుతుండగా... అదే క్రమంలో వెనక్కిరాని (అన్ కలెక్టబుల్) ఈఎఫ్‌ల సంఖ్య పెరుగుతూ పోతోంది. బుధవారం నాటికి ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ 18,07,239 ఉండగా గురువారం నాటికి 8,978 మేర తగ్గి 17,98,261కు చేరింది.అన్‌కలెక్టబుల్ ఈఎఫ్‌లు బుధవారం నాటికి 2,31,284 ఉండగా గురువారానికి మరో 8,978 పెరిగి 2,40,262కు చేరాయి. ప్రక్రియ ముగియనున్న చివరి రోజు శుక్రవారం నాటికి ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ మరికొంత తగ్గి, అన్‌కలెక్టబుల్ ఈఎఫ్‌ల సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికావర్గాలు చెబుతున్నాయి.


