అనంతపురం ఎడ్యుకేషన్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌లో కీలక బాధ్యతలు
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్‌వ్యూ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
రైతు కుటుంబం నుంచి...
మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జన్మించిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది.
అభినందనల వెల్లువ
రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు.
దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మ
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర
రైతు కుటుంబంలో పుట్టి జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన వైనం
యువతకు స్ఫూర్తిగా నిలిచిన సుష్మ
దేశానికి మరిన్ని సేవలు అందిస్తానంటున్న యువ శాస్త్రవేత్త


