మెగా పీటీఎం.. బంద్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

మెగా పీటీఎం.. బంద్‌ టెన్షన్‌

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌’ (పీటీఎం)కు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న వేళ, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం పీటీఎంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశిస్తుండగా, మరోవైపు బంద్‌ నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం, 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌బీ, ఏఐఎస్‌ఏ, పీఎస్‌యూ, పీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని కోరాయి.

అధికారుల స్పష్టమైన ఆదేశాలు

జిల్లా వ్యాప్తంగా 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్‌కు, పీటీఎంకు సంబంధం లేదని, నిర్ణయించిన ప్రకారమే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు హెచ్‌ఎంలు, టీచర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అడ్డుకుని తీరుతామని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు.

నిధులు తక్కువ.. ఖర్చులు ఎక్కువ

మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవడం లేదని హెచ్‌ఎంలు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 251 నుంచి 1,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6,750లు, 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.9,000 మాత్రమే కేటాయించారని, ఈ మొత్తంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించడం సాధ్యం కాదంటూ పెదవి విరుస్తున్నారు.

ఖాతాల్లోకి చేరని నిధులు

కేటాయించిన నిధులు ఎంఈఓల ఖాతాల్లో జమ చేశామని అధికారులు చెబుతున్నా గురువారం రాత్రి వరకు అనేక మంది హెచ్‌ఎంల ఖాతాలకు బదిలీ కాలేదు. దీంతో కార్యక్రమ నిర్వహణ కోసం సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎంను నిర్వహించాలని ఒత్తిడి చేస్తుండగా, మరోవైపు బంద్‌ ప్రభావం, నిధుల కొరత, నిర్వహణ భారంతో క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

నేడు పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని సర్కారు ఆదేశాలు

విద్యార్థి సంఘాల దేశవ్యాప్త

బంద్‌ పిలుపుతో

ఉపాధ్యాయుల్లో ఆందోళన

నిధులు నామమాత్రంగా ఉన్నా

పండుగలా చేపట్టాలని

ఆదేశించడంపై పెదవివిరుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement