● రూ. 73.23 కోట్ల మేర బకాయిలు
● ఆవేదన చెందుతున్న గ్రామీణులు
అనంతపురం న్యూటౌన్: రెండు దశాబ్దాల పాటు గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) చట్టం ఇటీవల ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ (వీబీజీ–రాంజీ)గా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 కంటే ముందు మంజూరైన పనులన్నీ ఆటోమేటిక్‌గా కొత్త చట్టంలోకి మారాయి. అయితే పాత చట్టంలో భాగంగా చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు విడుదల కాకపోవడం గమనార్హం. జూన్ 8 వరకూ మాత్రమే కూలి డబ్బులు అందాయని, ఆ తర్వాత ఖాతాల్లో జమ కాలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ. 73,23,82,790 మేర బకాయిలున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా శింగనమల మండలానికి చెందిన కూలీలకు రూ. 5,33,01,578 మేర బకాయిలున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బుక్కరాయసముద్రం, గుంతకల్లు మండలాలు ఉన్నాయి. వేతనాలు అందకపోవడంతో చేసేదిలేక వందలాది పేద కుటుంబాలు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర నగరాలకు వలస బాట పట్టాయి. వృద్ధులు, పిల్లలను వదలి సుదూర ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళుతున్నా ప్రభుత్వాలకు కనికరం లేకుండా పోయిందని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.


