‘పెద్ద సారు’ లేక.. శాంతిభద్రతలు పడక! | - | Sakshi
Sakshi News home page

‘పెద్ద సారు’ లేక.. శాంతిభద్రతలు పడక!

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

తాడిపత్రి రూరల్‌: జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన తాడిపత్రి పోలీసు సబ్‌ డివిజన్‌కు డీఎస్పీని నియమించడంలో పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ బదిలీపై పల్నాడుకు వెళ్లి 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఆ స్థానంలో మరొకరిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్షన్‌ ప్రభావితనియోజకవర్గంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఉహకందని పరిస్థితి. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడిగా పోలీసు పికెటింగ్‌ కొనసాగుతున్నా తరచూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండడమే ఇందుకు నిదర్శనం. తాడిపత్రి మండలంలోని వీరాపురంగ్రామంలో 2019లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చడంతో ప్రతీకార దాడులు జరగకుండా ఏర్పాటు చేసిన పికెటింగ్‌ నేటికీ కొనసాగుతోంది. ఆలూరు గ్రామంలో సైతం 2024 నుంచి పోలీసు పికెటింగ్‌ ఉంది. బ్రహ్మణపల్లిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా కొన్నిరోజుల క్రితం ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడం, అతని బైక్‌ను ప్రత్యర్థులు కాల్చి వేయడం గమనార్హం. ఊరుచింతల గ్రామంలో అయితే జంట హత్యలు జరిగాయి. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలందేవుని ఉప్పలపాడు, యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు, పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామంలో కూడా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వంద కిలోమీటర్ల దూరంలో ఇన్‌చార్జ్‌ డీఎస్పీ..

రోహిత్‌కుమార్‌ బదిలీపై వెళ్లాక గుంతకల్లు డీఎస్పీకి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. తాడిపత్రి పట్టణానికి గుంతకల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అత్యవసరమైతే తప్ప ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఇక్కడికి రాని పరిస్థితి. ఇదే అదనుగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్నింటినీ ‘క్యాష్‌’ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట, మట్కారాయుళ్లతో కొందరు పోలీసులు ప్రతి నెలా పెద్ద మొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలు అధికార పార్టీ నేత చెప్పిందల్లా చేస్తుండడం, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతుండడంతో శాంతిభద్రతలు గాల్లో దీపంలా మారాయి. అక్రమ పంచాయితీలు, పేకాట, మట్కా, ఇసుక, మట్టి తవ్వకాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సబ్‌డివిజన్‌ ప్రజలు కోరుతున్నారు.

తాడిపత్రి ఏఎస్పీ బదిలీపై వెళ్లి

15 రోజులు

గుంతకల్లు డీఎస్పీకి ఇన్‌చార్జ్‌ ఇచ్చి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు

ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతంలో క్షణక్షణం భయాందోళనగా పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement