● మెగా పీటీఎంలోవిద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
గుత్తి రూరల్: పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే వారితో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. శుక్రవారం గుత్తి మండలం రజాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు. గురుకులంలో నెలకొన్న సమస్యలపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ నాగజ్యోతితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని గురుకుల పాఠశాలలో చేర్పిస్తే.. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులతో మరుగుదొడ్లు, స్నానపు గదులు, పరిసరాలు ఎలా శుభ్రం చేయిస్తారు.. మీ పిల్లలైతే ఇలా చేయిస్తారా.. పేద పిల్లలంటే అంత చులకనగా కనపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జీతాలు రాలేదని పారిశుధ్య సిబ్బంది పని మానేస్తే.. వారి పనిని మా పిల్లలతో చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. భోజనం కూడా నాణ్యతగా ఉండటం లేదని, నీళ్ల పప్పు, చారు వడ్డిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే విద్యార్థినులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ సురేష్‌బాబు, అమీర్ ఖాన్ సిబ్బందితో కలిసి వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులను శాంతింపజేశారు.
నాసికరం భోజనంపై అసంతృప్తి
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): మండల కేంద్రమైన డీ.హీరేహాళ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు అందించిన మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి విద్యార్ధులు, తల్లిదండ్రుల కార్యక్రమానికి వచ్చారు. వడ్డించిన అన్నం ముద్దగా ఉండటంతో పాటు సాంబార్ నాణ్యత లేకపోవడంతో చాలామంది భోజనం చేయకుండా వెళ్లిపోయారు.
లక్ష్యం ఎంచుకుని చదవండి
గార్లదిన్నె: విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటో ఎంచుకుని అందుకు తగ్గట్టు చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం గార్లదిన్నెలోని జెడ్పీ హైస్కూల్‌లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. హిందీ ఉపాధ్యాయుల కొరత, ప్రహరీ, క్రీడా మైదానం సమస్యలను ఉపాధ్యాయులు విన్నవించారు.
పీటీఎం విజయవంతం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) విజయవంతంగా ముగిసిందని డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. 1,69,102 మంది విద్యార్థులు, 1,47,525 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, 22,240 మంది పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, 1,334 మంది పూర్వ విద్యార్థులు, 767 మంది దాతలు, 1,428 మంది ప్రజాప్రతినిధులు, 32,299 మంది ఇతరులు పాల్గొన్నారు.


