తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు.. | - | Sakshi
Sakshi News home page

తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు..

Sep 4 2023 1:36 AM | Updated on Sep 4 2023 11:15 AM

- - Sakshi

పుట్టపర్తి: కదిరి సమీపంలోని యర్రదొడ్డి క్వార్టర్స్‌ వద్ద ఆదివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో బుక్కపట్నం మండలం మదిరేబైలు, మదిరేబైలుతండా, రెడ్డివారిపల్లి తండా గ్రామాలకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఘోర ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన వారు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన గురించి తెలిసిన వెంటనే బంధువులు పెద్ద ఎత్తున ఆయా గ్రామాలకు తరలి వచ్చారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తమతో ఎంతో ఆనందంగా మాట్లాడి, వెళ్లొస్తామంటూ బయలుదేరారని, అంతలోనే ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

అందరూ పేద, మధ్య తరగతికి చెందిన వారే..
ప్రమాదంలో మృతి చెందిన వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఘటనలో మదిరేబైలు తండా సర్పంచ్‌ విజయకుమారి బాయి భర్త చిన్నస్వామి నాయక్‌ (35) ప్రాణాలు కోల్పోయారు. విజయ కుమారి బాయి, చిన్నస్వామి నాయక్‌ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. ట్రాక్టర్‌ బాడుగకు నడుపు కుంటూ దంపతులు జీవనం సాగిస్తుండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో కుటుంబపెద్ద చిన్నస్వామి నాయక్‌ మృతి చెందడంతో కుటుంబం దిక్కులేని దిగా మారింది. భర్త మరణ వార్త తెలుసుకున్న విజయకుమారి బాయి గుండెలవిసేలా రోదించారు. చిన్నస్వామి నాయక్‌ మృతదేహం వద్ద ఆమె రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

► ఇక మృతుల్లో ఒకరైన చలపతినాయక్‌ (37)కు భార్య నారాయణి బాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా కరెంట్‌ మెకానిక్‌ పనులు చేస్తూ చలపతినాయక్‌ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామస్తులతో ఎంతో కలివిడిగా ఉండేవారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడని తెలుసుకున్న పలువురు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని విలపించారు.

► రెడ్డివారిపల్లి తండాకు చెందిన భాస్కర్‌నాయక్‌ (48) కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు భార్య పతిబాయి, కుమారుడు ఉన్నారు. గ్రామంలో స్టోర్‌ డీలర్‌గా పనిచేస్తూనే, భార్యతో కలిసి కూలి పనులు చేసుకుంటూనే.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే భాస్కర్‌ నాయక్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు..
ప్రమాదంలో మదిరేబైలుకి చెందిన గోపాల్‌ రెడ్డి భార్య శ్రీలేఖ (35) కూడా ప్రాణాలు కోల్పోయింది. కదిరిలోని పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలు సుజిత, దీక్షితను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో పిల్లలిద్దరూ తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతదేహం వద్ద పిల్లలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామ ర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీకులను ఓదార్చారు. కాగా, సోమవారం జరగనున్న మృతుల అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరు కానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement