ధర్మవరం కాలువకు నీటి మళ్లింపు
కూడేరు: మండలంలోని పీఏబీఆర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని అధికారులు గురువారం మళ్లించారు. ఇటీవల జల్లిపల్లి వద్ద కాలువ గట్టు కోతకు గురి కావడంతో డ్యాం ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద మిడ్‌పెన్నార్ డ్యాంకు 300 క్యూసెక్కుల నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలువ మరమ్మతు పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దీంతో మరమ్మతులు చేసిన చోట కాలువ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గురువారం ఎస్కేప్ రెగ్యులేటర్ ఎంపీఆర్‌కు వెళుతున్న 300 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కుల ప్రవాహాన్ని ధర్మవరం కుడి కాలువలోకి మళ్లించారు. నీరు సజావుగా ప్రవహిస్తే మరో వంద క్యూసెక్కుల నీటిని కూడా కుడి కాలువకు మళ్లించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదంలో యువకుడి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని వరదాయపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో చుక్కలూరు గ్రామానికి చెందిన రత్నకుమార్ (20) మృతిచెందాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళుతున్న వారు క్షతగాత్రుడిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విసయంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఏసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి రూరల్ పోలీసులు తెలిపారు.
గ్రో కవర్లతో దానిమ్మకు రక్ష
కూడేరు: ప్రస్తుతం దానిమ్మ పంటకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. టన్ను దానిమ్మ కాయలు నాణ్యతను బట్టి రూ. లక్ష నుంచి రూ.1.45 లక్షల ధర పలుకుతోంది. దీంతో కూడేరు, కడదరకుంట, కమ్మూరు, చోళసముద్రం, జయపురం, కొర్రకోడు, మరుట్ల, ఇప్పేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో రైతులు దానిమ్మ పంటను ఎక్కువగా సాగు చేశారు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంటకు తెగుళ్లు ఆశించకుండా దానిమ్మ చెట్లను పూర్తిగా గ్రో కవర్లతో కప్పేశారు. దీంతో ఊజీ ఈగ, మజ్జిగ ఈగ తెగుళ్లు ఆశించడం లేదని రైతులు అంటున్నారు.


