వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె ధ్వంసం
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లిలో రఘునాథరెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, జెండా పోల్ ఎత్తుకెళ్లి గ్రామ శివారున పడేశారు. విసయాన్ని గురువారం ఉదయం వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తించి జెండా దిమ్మె వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తిమ్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివరంగనాయకులు, సంజీవ, మండల మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్‌వలి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రెచ్చగొట్టేలా కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐ రామారావును కలసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, హనుమంతు, షాషావలి, రంగనాయకులు, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, రాజేష్ పాల్గొన్నారు.
గుత్తి ఆర్‌ఎస్‌లో
వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల చింపివేత
గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌లోని ఎస్సీ కాలనీ సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహితపై
మందు బాబుల వీరంగం
ఉరవకొండ: దర్గాకు వెళుతున్న ఓ ముస్లిం వివాహిత పట్ల మందుబాబులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం మహబూబ్ సుబహానీ దర్గాకు వెళుతుండగా మార్గమధ్యంలో కామన్నకట్ట వద్దకు చేరుకోగానే నడిరోడ్డుపైనే మద్యం తాగుతున్న కొందరు యువకులు ఆమె మార్గానికి అడ్డుగా నిలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దర్గాకు సమీపంలో ఇలా నడిరోడ్డుపై మద్యం తాగడం మంచిది కాదంటూ ఆమె సహనంతో హితవు పలికింది. ఆ సమయంలో పచ్చి బూతులతో యువకులు రెచ్చిపోయారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు వెంటనే అక్కడకు చేరుకోవడంతో పక్కకు వైదొలిగారు. విషయం పది మందికి తెలిస్తే కుటుంబ పరువు పోతుందని బాధిత మహిళ ఏడుస్తూ ఇంటికెళ్లిపోయింది. కాగా, న్యూఇయర్ సంబరమంటూ కామన్నకట్ట వద్ద ఉన్న బెల్టుషాపు నుంచి కొందరు యువకులు మద్యం కొనుగోలు చేసి నడిరోడ్డుపైనే తాగుతూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వివాహిత అదృశ్యం
తనకల్లు: మండల పరిధిలోని రాగినేపల్లికి చెందిన వివాహిత నాగ శిరీషా అదృశ్యమైనట్లు ఎస్‌ఐ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల వివరాలమేరకు... రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగ శిరీషా ఆ తరువాత తిరిగి రాలేదు. భర్త హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె ధ్వంసం


