యువకుడి దుర్మరణం
గుంతకల్లు రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన వంశీకృష్ణ (28) గురువారం ఉదయం గుత్తి మండలం తురకపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమై గుంతకల్లులోని పారిశ్రామిక వాడ్డ వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వంశీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. కాగా, వంశీకృష్ణకు ఆరు నెలల క్రితం వివాహమైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ బాలముని తెలిపారు.


