గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరుతో కీలకమైన 2025 ఖరీఫ్ ముగి
ఉరవకొండ మండలం నింబగళ్లు వద్ద సాగైన పప్పుశనగ పంట
అనంతపురం అగ్రికల్చర్: రబీ ముగిసింది. సీజన్‌లో 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా.. 70 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. ప్రధానపంట పప్పుశనగ 65 వేల హెక్టార్లకు పైబడి సాగు చేయొచ్చని అంచనా వేయగా 48 వేల హెక్టార్లకు పరిమితమైంది. వేరుశనగ 18 వేల హెక్టార్ల అంచనాకు గానూ 6 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న మాత్రమే 7 వేల హెక్టార్లతో సాధారణ విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. జొన్న 3,500 హెక్టార్లు, కుసుమ 800, నువ్వులు 650, ఉలవ 1,350, పెసర 150, పత్తి 110 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. వరి 6,069 హెక్టార్లు అంచనా వేయగా... జనవరిలో సాధారణ సాగు విస్తీర్ణానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో విత్తన పప్పుశనగ ఇవ్వకపోవడం, కష్టాలు పడి ఎలాగోలా సాగు చేసినా మోంథా తుపాను దెబ్బ తీయడంతో పప్పుశనగ పంట విస్తీర్ణం తగ్గినట్లు చెబుతున్నారు.
వర్షాభావం, తెగుళ్ల ప్రభావం..
రబీలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 139.2 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేయగా, 14 శాతం తక్కువగా 120.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో 100.7 మి.మీ గానూ 6 శాతం అధికంగా 106.8 మి.మీ వర్షం కురిసింది. ఇక నవంబర్‌లో 28.7 మి.మీ గానూ 67.2 శాతం తక్కువగా 9.4 మి.మీ, డిసెంబర్‌లో 9.8 మి.మీ గానూ 54.1 శాతం తక్కువగా 4.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌గా మూడు నెలల కాలంలో కేవలం 11 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షం కురవగా, మరో ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. దీనికి తోడు మోంథా, దిత్వా లాంటి తుపాన్ల కారణంగా ప్రతికూల వాతావరణం నెలకొనడంతో పప్పుశనగకు తెగుళ్లు సోకి రైతుల్లో ఆందోళన పెంచాయి.
దిగజారిన ఆర్థిక పరిస్థితి..
ఈ ఏడాది మొత్తంగా అకాల వర్షాలు లేదంటే అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీ రైతులకు పెద్దగా కలిసిరాక నష్టాలబాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సకాలంలో విత్తన పప్పుశనగ కూడా ఇవ్వకుండా దాటవేసింది. 14 వేల క్వింటాళ్లు కేటాయించి కేవలం 2 వేల క్వింటాళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. 7 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగకు గానూ 4,500 క్వింటాళ్లతో సరిపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్‌పుట్, ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా ఊసే ఎత్తకపోవడంతో రైతులు కుదేలయ్యారు.
ముగిసిన రబీ సీజన్
సాధారణం కన్నా 14 శాతం తక్కువగా వర్షాలు
చంద్రబాబు సర్కారు అలసత్వంతో తగ్గిన సాగు విస్తీర్ణం
ఆర్థిక చేయూత కరువై అన్నదాత ఉక్కిరిబిక్కిరి


