కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోండి
● సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత హితవు
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి కోరారు. గురువారం నగరంలోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ‘అనంత’ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా అన్నదాతలకు అండగా నిలవాలని హితవు పలికారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
బాల్య వివాహాలు అరికడదాం
● మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ: బాల్య వివాహాలు అరికట్టి, జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బాల్య వివాహ్ విముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని గురువారం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో మంత్రి కేశవ్ ప్రారంభించారు. పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణవాసులను చైతన్యవంతులను చేసి బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు రాజేశ్వరి, అరుణ, రబియా, పుష్ప, విజయ, పద్మ, సురేఖ, ధనశేఖర్ పాల్గొన్నారు.
కొండపై నుంచి దూసుకొచ్చి.. కాళ్లను ఛిద్రం చేసి
● ఉరవకొండలో బండరాయి పడి
విద్యార్థికి తీవ్ర గాయాలు
ఉరవకొండ: కొండ రాయి పడి విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన ఉరవకొండలో గురువారం జరిగింది. వివరాలు... ఉరవకొండకు చెందిన చికెన్ వ్యాపారి లెనిన్‌బాబు కుమారుడు మహ్మద్ సమీన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం తోటి స్నేహితులతో కలిసి స్థానిక రేణుకా యల్లమ్మ ఆలయ సమీపంలో కొండ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో కొండ పై నుంచి పెద్ద గుండురాయి అకస్మాత్తుగా దొర్లుకుంటూ రావడం చూసి పరుగు తీసినా ఫలితం లేకపోయింది. అదుపుతప్పి కిందపడిన సమీన్ కాళ్లపై రాయి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
విద్యుత్ కోతలపై నిరసన
కుందుర్పి: మండలంలో వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ సకాలంలో అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు గురువారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేక పోయారంటూ మండిపడ్డారు. 6 గంటలు కూడా విద్యుత్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలంటూ ఏఈ జయకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు రామాంజి, నేత్రావతి, హరి, బాలరాజు పాల్గొన్నారు.
కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోండి
కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోండి


