నేడు జిల్లాకు ఆడిట్ బృందం రాక
● పశుశాఖలో ఆర్థిక కుంభకోణంపై మరోసారి విచారణ
● ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్, రిటైర్డ్ జేడీకి బెనిఫిట్స్ నిలిపివేత
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధక శాఖలో సంచలనం సృష్టించిన రూ.1.03 కోట్ల ఆర్థిక కుంభకోణానికి సంబంధించి విచారణకు మరోసారి ఆ శాఖ రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం శుక్రవారం జిల్లాకు రానుంది. కె.సత్యనారాయణ, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్‌తో కూడిన ముగ్గురు అధికారుల బృందం రెండు రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు పరిశీలించనుంది. ఎంత మొత్తం పక్కదారి పట్టింది... ఎవరెవరి పాత్ర ఎంతనే దానిపై పక్కాగా తేల్చనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పశుశాఖలో వెలుగుచూసిన ఆర్థిక కుంభకోణంపై ఇప్పటికే గత ఏడాది నవంబర్ 14, 15న ప్రాథమిక పరిశీలన జరిపారు. డైరెక్టరేట్ అధికారులు మూడు దఫాలుగా జిల్లా అధికారుల నుంచి సేకరించిన వివరాల తర్వాత ఇటీవల ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ సుశీలను సస్పెండ్ చేశారు. అలాగే విశ్రాంత జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామికి అందాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.42 లక్షలను నిలుపుదల చేశారు. ఆ శాఖకు వివిధ బ్యాంకుల్లో ఉన్న బ్యాంకు ఖాతాలు, అందులో ఉన్న సొమ్ము, బదలాయింపులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు తదితర వాటిని ప్రాథమికంగా పరిశీలించారు. యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి 18 ఖాతాల ద్వారా రూ.1.03 కోట్ల వరకు ఎలాంటి అనుమతులు, బిల్లులు, ఓచర్లు లేకుండా సొంత ఖాతాలతో పాటు కుటుంబ సభ్యులు, మిత్రుల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. తాజాగా మరోసారి రెండు రోజుల పరిశీలనకు ఆడిట్ బృందం వస్తుండటంతో త్వరలో ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


