డిపో దాటి రానంటున్న బస్సు
జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది. జిల్లా వ్యాప్తంగా బస్సులు సకాలంలో తిరగకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో లాంగ్ సర్వీసు బస్సు పూర్తిగా రద్దయింది.
● అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రయాణికులకు తిప్పలు
అనంతపురం క్రైం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజారవాణా వ్యవస్థ నిర్వీర్యమవుతూ వస్తోంది. దీనికి తోడు అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్టీసీ సేవలు పూర్తిగా గాడితప్పాయి. అనంతపురం డిపో నుంచి హైదరాబాద్, బెంగళూరు, చైన్నె ప్రాంతాలకు తిరుగాడే లాంగ్ సర్వీసు బస్సులను కొంత కాలం క్రితం ఆర్టీసీ అధికారులు రద్దు చేసి ఇతర డిపోలకు బదిలీ చేశారు. దీంతో ఆయా సర్వీసుల్లోని బస్సులను ఆయా డిపోలకు పంపి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లే సర్వీసును గుత్తి డిపోకు బదిలీ చేస్తూ బస్సును పది రోజుల క్రితం ఆ డిపోకు పంపారు. అయితే ఈ బస్సు గుత్తి డిపో నుంచి బయటకు రావడం లేదు. విషయం తెలియని హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు రోజూ రాత్రి 10 గంటల సమయంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవడం.. గంటల తరబడి వేచి చూడడం పరిపాటిగా మారింది.
డ్రైవర్లు లేరంటూ...
లాంగ్ సర్వీసు బస్సు గుత్తి డిపో దాటి బయటకు రాకపోవడంతో దాదాపుగా ఆ సర్వీసు రద్దైనట్లుగా తెలుస్తోంది. అయితే సర్వీసును తిప్పడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు సహేతుకమైన కారణాలు వెల్లడించలేకపోతున్నారు. డ్రైవర్లు లేని కారణంగా బస్సు డిపో గేట్ దాటించలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సంస్థ ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ సమస్య ఒక్క గుత్తి డిపోలోనే కాదు.. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లోనూ ఉన్నట్లుగా కార్మికులు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఉన్నఫళంగా బస్సు సర్వీసులు తాత్కాలికంగా రద్దయిపోతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించిన ఆర్టీసీ ప్రతిష్ట కాస్త ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మసకబారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందనే సంకేతాలను కార్మిక సంఘాల నేతలు వెలువరిస్తున్నారు.


