తాడేపల్లి : అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాల చేసిన దాడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ప్రస్తుతం విజయప్రతాప్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన తండ్రితో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు వైఎస్ జగన్.
ఈ క్రమంలోనే టీడీపీ గూండాల దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో వారు చేస్తున్న దాడులను తిప్పికొడదామన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘ఈ అనైతిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారు. వైఎస్సార్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి. అందరికీ పార్టీ అండగా ఉంటుంది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వారందరికీ తగిన గుణపాఠం చెబుదాం’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.
కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ బరితెగించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రతాప్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


