దేవరాపల్లి: మండలంలో మట్టి మాఫియా పెట్రేగిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రీపగలు తేడా లేకుండా సాగు నీటి చెరువులను చెరబడుతున్నారు. అధికార యంత్రాంగం సైతం పట్టించుకోక పోవడంతో దర్జాగా మట్టిని తవ్వి విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. మండలంలోని ముషిడిపల్లి నాగారాయుడు చెరువులో మూడు రోజులుగా అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రి 11 గంటల దాటిన తర్వాత ప్రారంభించి తెల్లవారు జాము 4 గంటల వరకు ఏకధాటిగా తవ్వకాలు చేపడుతున్నారు. చెరువు మధ్యలో పొక్లెయిన్‌తో భారీగా గొయ్యిలు చేసి, ట్రాక్టర్లతో విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి మట్టి తరలించుకుపోతున్నారు. ఈ చెరువు గ్రామానికి దూరంగా ఉండడంతో జన సంచారం లేని అర్ధరాత్రి సమయంలో మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ముషిడిపల్లికి చెందిన టీడీపీ నేత అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దేవరాపల్లి–ఆనందపురం ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువులో మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చెరువులో భారీగా గోతులు తవ్వడంతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. వర్షాలు కురిస్తే గోతుల్లో నీరు చేరి, రైతులు, పశువుల కాపరులు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక రైతులు, గ్రామస్తులు డి మాండ్ చేస్తున్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కె.అప్పారావు ప్రస్తావించగా అక్రమతవ్వకాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, వీఆర్‌వోను పంపించి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ముషిడిపల్లి నాగారాయుడు చెరువు నుంచి భారీగా తరలింపు
టీడీపీ నేత అండదండలతోరెచ్చిపోతున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు


