సా...గుతూ..! | - | Sakshi
Sakshi News home page

సా...గుతూ..!

Jul 20 2026 12:50 AM | Updated on Jul 20 2026 12:50 AM

రెండేళ్లుగా

ముకుందరాజుపేట వద్ద నత్త నడకన జరుగుతున్న పోలవరం కాలువపై వంతెనల నిర్మాణం

నక్కపల్లి: జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ పనుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి పోలవరం కాలువ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. 1994లో ఈ ప్రాంత రైతులు రేబాక పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని, ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. అయితే పోలవరం తప్ప మరేమైనా అడగండి..పోలవరం ఊసెత్తకండి అని వారికి చంద్రబాబు ఖరాఖండిగా చెప్పేసారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహానేత

ఇదే రైతులు 2003లో పాదయాత్ర చేసిన సందర్బంలో దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాంత పర్యటనకు వచ్చినపుడు కలసి ఈప్రాంతమంతా వర్షాధారమని, సరైన సాగునీటి సదుపాయం లేక వేలాది ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు నిర్మించి కాలువలు తవ్వితే ఈప్రాంత మంతా సస్యశ్యామలమవుతుందని వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లాకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో

50 కిలోమీటర్ల కాలువ నిర్మాణం

ఇచ్చిన మాట ప్రకారం 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్దాపన చేయడంతో పాటు పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు, 6,7,8 ప్యాకేజీల కింద ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు ప్రారంబించారు. సుమారు 50 కిలోమీటర్లు దూరం కాలువ నిర్మాణం కోసం భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. కాలువ నిర్మాణాన్ని పాయకరావుపేట నియోజకవర్గంలో పీఎల్‌పురం, సీతారామపురం, నక్కపల్లి మండలంలో దేవవరం, గొడిచర్ల, డొంకాడ, గుల్లిపాడు, ముకుందరాజుపేట, రమణయ్యపేట, చినదొడ్డిగల్లు, సీతంపాలెం, పెదబోదిగల్లం, ఎస్‌రాయవరం మండలం రామయ్యపట్నం, పెట్టుగోళ్లపల్లి, యలమంచలి మండలం కొత్తూరు, యలమంచలి, కొత్తలి మీదుగా తాళ్లపాలెం వరకు దాదాపు 40 శాతం పనులు పూర్తి చేశారు. వై.ఎస్‌ మరణానంతరం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సైతం ఈ కాలువ పనులు నిర్లక్ష్యం చేశాయి. 2019 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలువ నిర్మాణ పనులు కొనసాగించడం, ఇరువైపులా రాతి కట్టు, అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు చేపట్టింది.

కూటమి ప్రభుత్వంలో నత్తనడక..

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్లే వర్షపునీరు, కొండ గెడ్డల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్యాసేజీ పనులు, అలాగే అక్కడక్కడ బ్రిడ్జిలు, వంతెనల నిర్మాణపు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. రూ.333 కోట్ల వ్యయంతో మండలంలో ముకుందరాజుపేట, రమణయ్యపేట, దార్లపూడి, పెద బోదిగల్లం, దొడ్డిగల్లు, ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి, ప్రాంతాల్లో జరుగుతున్న వంతెనలు, సూపర్‌ పాసేజెస్‌ పనులు చేపట్టారు. ఆరో ప్యాకేజీలో 16 వంతెనలు, 14 సూపర్‌పాసేజ్‌లు నిర్మాణంలో ఉన్నాయి.

ముంచెత్తుతున్న వర్షపు నీరు

వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలు, గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తకుండా ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు చురుగ్గా జరగడం లేదు. వర్షాలు పడిన సమయంలో వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. అలాగే కాలువకు అవతల ఉన్న పొలాలు, భూములకు వెళ్లేందుకు వంతెనలు నిర్మించాలని బోదిగల్లం, చినదొడ్డిగల్లు, సీతంపాలెం, పెట్టుగోళ్లపల్లి, రమణయ్యపేట తదితర గ్రామాల పరిధిలో వీటిని నిర్మించకపోవడం వల్ల రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డులేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి వర్షపునీరు యధావిధిగా చేరేందుకు సూపర్‌పాసేజ్‌లు నిర్మించలేదు. డొంకాడ, ముకుందరాజుపేట, గుల్లిపాడు సీతారాంపురం, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో కాలువ నిర్మాణపు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ కాలువను పూర్తిగా కొనసాగించకుండా మధ్యమధ్యలో వదిలేయడం వల్ల కాలువ ఎప్పటికి పూర్తవుతుందోనన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్మించిన కాలువలకు లైనింగ్‌ చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిపోతోంది. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వంతెనలు, సూపర్‌ పాసేజ్‌లు పూర్తిచేసి అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

నత్తనడకన పోలవరం కాలువ పనులు రూ.333 కోట్లతో వంతెనలు, సూపర్‌ పాసేజ్‌లు

ఏడాదిగా అరకొరగా పనులు వర్షాలు వస్తే ముంచెత్తుతున్న వరద నీరు

కాలువపై వంతెనలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు

పనుల్లో జాప్యంతోఅనేక ఇబ్బందులు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. వంతెనలు, సూపర్‌పాసేజ్‌ పనులు తొందరగా పూర్తి చేయకపోవడం వల్ల రైతుల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరదనీరు సూపర్‌పాసేజ్‌లు లేకపోవడం వల్ల దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పనుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల నాణ్యత కూడా లోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయింది. చినదొడ్డిగల్లు వద్ద కాలువ తవ్వేశారు. వంతెన లేకపోవడం వల్ల పొలాల్లోకి వెళ్లే రైతులు ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా దూరం వెళ్లి చేరుకోవాల్సి వస్తోంది.

– గొర్లగోవిందు, రైతు, సీతంపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement