పాడేరు/మాడుగుల: పాడేరు–చోడవరం ప్రధాన రహదారి ఘాట్ మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గుర్రాలపాలెం ప్రాంతానికి చెందిన కొంతమంది భక్తులు ఆదివారం పాడేరు ఘాట్‌రోడ్డులో అమ్మవారి పాదాల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం భోజనాలు ముగించుకుని సాయంత్రం వ్యాన్‌లో తిరిగి గ్రామానికి బయలుదేరారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇప్పమాను జంక్షన్ వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో రోలుగుంట మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన చలపతి(50) అక్కడికక్కడే మృతి చెందాడు. పాడేరు ఎస్‌ఐ పాపినాయుడు సంఘటన స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను మాడుగుల సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన సూరిశెట్టి అప్పారావు (60), మరణించాడని, మరో 14 మంది క్షతగాత్రులను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని వైద్యుడు రాజుకుమార్ తెలిపారు. పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు


