మాకవరపాలెం: బ్లాక్‌స్టోన్ పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించారు. మండలంలోని పెద్దిపాలెం, పైడిపాల, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో పరిశ్రమల స్థాపనకు 4,259 ఎకరాల ల్యాండ్ బ్యాంకును రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అలాగే రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లోనూ ప్రభుత్వం 406 ఎకరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం తూటిపాల, యరకన్నపాలెం ప్రాంతాల్లో జేసీ శౌర్యమాన్‌పటేల్, బ్లాక్‌స్టోన్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. ఈ కంపెనీకి సుమారు 500 ఎకరాల భూమి అవసరంగా చెబుతున్నారు. దీంతో ముందుగా తూటిపాల రెవెన్యూలో బ్లాక్ స్టోన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కలసి భూములను, వాటికి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో సేకరించిన 406 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలను డోజ్కో కంపెనీకి కేటాయించారు. మిగిలి ఉన్న భూమిని కూడా జేసీ పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీవో రమణ, తహసీల్దార్ నూకరాజు, ఏసిఐఐసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మే నెలలోనూ ఇదే కంపెనీ ప్రతినిధులు ఈ భూములను పరిశీలించారు.


