కూటమి దోపిడీపై
ఎంపీ రమేష్, ఎమ్మెల్యే విజయకుమార్ మైనింగ్ అక్రమాలపై నిరసన
● పెద్దఎత్తున హాజరైన ప్రజలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు
● వందలాది కార్లు, వేలాది బైకులతో 20 కి.మీ మేర యాత్ర
● అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
● చారిత్రక, ఆధ్యాత్మిక సంపద పరిరక్షణకు పోరాటం ఆగదంటూ హెచ్చరిక
● హాజరైన శాసనమండలి విపక్ష నేత బొత్స, రీజినల్ కోఆర్డినేటర్‌లు కన్నబాబు, అమర్‌నాథ్ , పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, కేకే రాజు
దిగ్విజయంగా వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’
మునగపాక నుంచి ‘చలో పంచదార్ల’కు
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రజాప్రతినిధుల అక్రమ మైనింగ్ దోపిడీపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. పవిత్రమైన పంచదార్ల చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో పంచదార్ల’ ధర్మపోరాట యాత్ర దిగ్విజయంగా సాగింది. స్థానిక కూటమి ఎంపీ సీఎం రమేష్, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌లు చేస్తున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ప్రవాహంలా తరలివచ్చారు. అనకాపల్లి టౌన్ రింగురోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ధర్మపోరాట యాత్ర పూడిమడక జంక్షన్, మునగపాక, అచ్యుతాపురం మీదుగా రాంబిల్లి మండలంలోని వెంకటాపురం జంక్షన్, పంచదార్ల కొండ వరకూ సుమారుగా 25 కిలోమీటర్ల మేర సాగింది. యలమంచిలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వందలాది కార్లు, వేలాది మోటార్ బైక్‌లతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు కూటమి నేతల అక్రమాలను నిరసిస్తూ నినాదాలతో ర్యాలీగా సాగారు. ఈ ధర్మపోరాట యాత్ర ఏకంగా 3 గంటల సమయం పట్టిందంటే ప్రజా స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దారి పొడవునా ప్రజలు వైఎస్సార్‌సీపీ నాయకులకు ఘనస్వాగతం పలికారు.
అక్రమ మైనింగ్ ప్రదేశాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
పంచదార్ల చేరుకున్న అనంతరం వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కొల్లగొడుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి బాలరాజు, సమన్వయకర్తలు కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అధీప్‌రాజ్, వాసుపల్లి గణేష్‌కుమార్, మలసాల భరత్‌కుమార్, మొల్లి అప్పారావు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, వీసం రామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు సతీష్‌వర్మ, ఏడువాక సత్యారావు, పైలా శ్రీనివాసరావు, గండి రవి, బాణాల శ్రీనివాసరావు, పలువురు ముఖ్య నాయకులు పరిశీలించారు.
వెంకటాపురం జంక్షన్ వద్ద సభకు హాజరైన జనసందోహం
రేపటి నుంచి మైనింగ్ ఆపేయాల్సిందే –బొత్స సత్యనారాయణ
కూటమి ప్రభుత్వ అక్రమాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం దోచుకోవడం, దాచుకోవడం, అక్రమ సంపాదనపైనే కూటమి ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తున్నారు. విశాఖలో సింహాచలం, అనకాపల్లిలో పంచదార్ల కొండను పిండిచేస్తూ అక్రమ సంపద ఆర్జిస్తున్నారు. దశాబ్దాల కాలం నాటి పవిత్ర శివుని దేవాలయాన్నే దోచుకుంటున్నారు. దేవాలయ సంరక్షణ, సనాతన ధర్మం అంటున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి ఏదో కుట్రలు జరిగిపోతున్నాయంటూ మాట్లాడుతున్నాడు. మీదే ప్రభుత్వం కదా! మీది చేతగాని ప్రభుత్వమా చెప్పండి? కుట్రలు జరిగితే బయటకు తీయండి. శివుడితో రాజకీయాలొద్దు... ధర్మలింగేశ్వర స్వామి మూడో కన్ను తెరిస్తే కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. శివుడికి ఎదురొడ్డి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే వెళ్తున్నారు... తస్మాత్ జాగ్రత్త! రేపటికల్లా అక్కడ మైనింగ్ చేసే యంత్రాలు, ఏ ఒక్క వ్యక్తీ ఉండకూడదు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌ను కోరుతున్నాను... ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి. ’నో మైనింగ్ జోన్’గా ప్రకటించకపోతే మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుంది.
ప్రజా పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం– కురసాల కన్నబాబు
కూటమి ప్రజాప్రతినిధులు చేస్తున్న మైనింగ్ దోపిడీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ధర్మపోరాటానికి వేలాదిమంది ప్రజలు, కేడర్ వచ్చి విజయవంతం చేశారు. కూటమి ప్రజాప్రతినిధులు తమ చేతుల్లో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ పోతామంటే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పవిత్రమైన పంచదార్ల కొండను బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఇద్దరూ పంచుకుని తొలిచేస్తున్నారు. ‘మొన్న చేపట్టిన రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినప్పుడు పంచదార్ల అక్రమ మైనింగ్ విషయాన్ని మా నాయకుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. పవిత్రమైన ఫణిగిరి కొండను అపవిత్రం చేస్తున్న వారు ఎంతటివారైనా వైఎస్సార్‌సీపీ పోరాడాలని, ప్రజా పక్షాన నిలవాలని ఆయన ఆదేశించారు. అప్పటికీ ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం లేకపోతే తానే స్వయంగా వస్తానని జగన్ చెప్పారు. మా ప్రభుత్వంలో విశాఖలోని రుషికొండపై ప్రభుత్వ భవనం కడితే, రుషులు ధ్యానం చేసే కొండ అంటూ ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్‌కళ్యాణ్ తమ అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఊదరగొట్టారు. మరి ప్రస్తుతం విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదార్ల దైవక్షేత్రాల కొండలనే పిండి చేస్తుంటే సనాతన ధర్మం ఏమైపోయింది? వెంటనే పంచదార్లను ’నో మైనింగ్ జోన్’ గా ప్రకటించాలి.
డబుల్ ఇంజిన్ దోపిడీ – బొడ్డేడ ప్రసాద్
అడ్డుకుంటే బెదిరింపులు
– కరణం ధర్మశ్రీ
పవిత్ర పుణ్యక్షేత్రమైన శివుడు ఉన్న కొండ అని తెలిసి కూడా అక్రమంగా తవ్వేస్తున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మైనింగ్, దేవదాయ, ఆర్కియాలజీ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోతోంది. అక్రమ గ్రావెల్ లారీలను పంచదార్ల కొండను ఆనుకుని ఉన్న గ్రామస్తులు అడ్డుకుంటే లారీలతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. పంచదార్ల దైవక్షేత్రం పాండవులు సంచరించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, శేషాద్రి కొండ కన్నా పవిత్రమైంది. ఈ కొండపై మైనింగ్ జరగకుండా ’నో మైనింగ్ జోన్’ సాధించే వరకు పోరాడుతాం.
సీఎం రమేష్
కరెప్టెడ్ మ్యాన్
– గుడివాడ అమర్‌నాథ్
పన్నెండు దశాబ్దాల క్రితం నుంచి ఈ ఫణిగిరి కొండపై పవిత్ర పంచధారల పేరిట ధారలు వస్తే, అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ఆ ధార కాస్తా ఫణిగిరి కింద కన్నీరుగా మారింది. స్థానిక ప్రజలు వందలాది గ్రావెల్ టిప్పర్ లారీలను అడ్డుకుంటే వారిపై కేసులు పెడుతున్నారు. ఫణిగిరి కొండ పరిధిని తక్షణమే ’నో మైనింగ్ జోన్‌్’గా ప్రకటించాలి. కూటమి నేతలు ఇక్కడ గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తున్నారు. ‘సీఎం రమేష్ అంటే కరెప్టెడ్ మ్యాన్. నువ్వు ఉమా ధర్మలింగేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు, మాడి మసైపోతావు జాగ్రత్త! సీఎం రమేష్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం, హరహర మహాదేవుడి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలే ఆయనకు రాజకీయ పతనాన్ని చూపిస్తారు.
కొండలు పిండి చేస్తున్నారు –కేకే రాజు
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే, ఇక్కడ ’డబుల్ ఇంజిన్ దోపిడీ’ జరుగుతోంది. సామాన్య రైతు ఒక తట్ట మట్టి తవ్వితే పోలీసులు కేసు పెడుతున్నారు.. అలాంటిది పవిత్రమైన పంచదార్ల కొండనే తవ్వేస్తుంటే ఒక్క కేసు ఎందుకు పెట్టలేదో? గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పంచదార్ల కొండను తొలిచేసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చి సనాతన ధర్మం వంటి పెద్ద పెద్ద మాటలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూటమి నేతలు చేస్తున్న పాపాలు కనపడడం లేదా?
కూటమి ప్రభుత్వంలో కొండలను పిండేస్తున్నారు.. భూ దోపిడీకి పాల్పడుతున్నారు. అనకాపల్లిలో సహజ వనరులను దోచుకోవడానికే రాయలసీమ నుంచి ఇక్కడకు ప్రజాసేవ పేరుతో సీఎం రమేష్ వచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఈ ప్రాంత సంస్కృతిని మంటగలుపుతున్నారు. పంచదార్ల కొండ పరిధిలో 31 కి.మీ నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ వెంటనే జీవో ఇవ్వాలి..


