విశాఖ విద్య: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) బుధవారం ఆంధ్ర యూనివర్సిటీలో పర్యటించి విశ్వవిద్యాలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆడిట్ నివేదికలపై సమీక్ష నిర్వహించింది. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు అధ్యక్షతన ఏయూ ఐఐఎం భవనంలో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్, జాబ్‌మేళాల నిర్వహణ, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశపెట్టడం, సిలబస్, బోధనా విధానాలు, పోటీ పరీక్షలకు శిక్షణ, వెబ్‌సైట్ నిర్వహణ, యువతకు ఉపాధి సమాచారం చేరవేత తదితర అంశాలతో పాటు ఆడిట్ పారాలపై కమిటీ సమగ్రంగా సమీక్షించింది. గత పర్యటనలో ఖాతాల నిర్వహణపై పలు ప్రశ్నలు లేవనెత్తిన కమిటీ, ఈసారి కూడా ఆర్థిక లావాదేవీలు, వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించింది. ఏయూ వైస్ చాన్సలర్ జి.పీ. రాజశేఖర్ విశ్వవిద్యాలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్స్ నిర్వహణపై పూర్తి నివేదికను కమిటీకి సమర్పించారు. ఆడిట్ నివేదికలను పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తామని పీఏసీ చైర్మన్ తెలిపారు. సమావేశంలో పీఏసీ సభ్యులు రామ్ రాజగోపాల్, పి. విష్ణుకుమార్ రాజు, అరిమిల్లి రాధాకృష్ణ, కోళ్ల లలిత కుమారి, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
ఏయూలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష


