మొద్దు నిద్ర నటిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు
విశాఖ నుంచి ఒక్క కొత్త రైలు లేదు.. దారి మళ్లిన రైళ్లు వెనక్కి రాలేదు
స్పెషల్ సర్వీసులకూ మొండిచేయి.. కీలక రైళ్లు దువ్వాడకే పరిమితం
సమీక్షలకే పరిమితమైన యంత్రాంగం.. ఇంకా పక్క జోన్ల పెత్తనమే..
50 రోజుల్లో
అధికారులున్నా.. నిర్ణయాలు లేవు
జీఎం, సీపీటీఎం వంటి ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ, జోన్ పరిధిలోనే పరిష్కరించగల స్థానిక సమస్యలపై కూడా ఎవరూ చొరవ చూపడం లేదు. విశాఖ డివిజన్ డీఆర్‌ఎం సైతం కొత్త సర్వీసులపై స్పందించకపోవడం గమనార్హం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పురోగతికి సమయం పట్టినా, రైల్వే బోర్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్న పనులను కూడా మూలన పడేశారు. ప్రయాణికులకు ఉపయోగపడే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నా ప్రజల్లో ‘జోన్ వచ్చింది’ అనే సంతృప్తి ఉండేది. పక్క జోన్లు లాభపడుతుంటే, ఇక్కడి అధికారులు మాత్రం కేవలం ఏసీ గదుల సమీక్షలకే పరిమితమవుతున్నారు. ఇప్పటికై నా జోన్ ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి స్పందించాలి. 100 రోజుల నాటికై నా దారి మళ్లిన రైళ్లను తిరిగి విశాఖకు రప్పించి, ఇక్కడి నుంచే కొత్త సర్వీసులను ప్రారంభించి, జోన్ ఉనికిని కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయారైంది దక్షిణ కోస్తా రైల్వే జోన్ తీరు. దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న కలల జోన్ ప్రారంభమై 50 రోజులు పూర్తవుతున్నా, సామాన్య ప్రయాణికుడికి కనిపించిన మార్పు శూన్యం. కార్యాలయం విశాఖలో ఉన్నా.. రైళ్లు మాత్రం ఇప్పటికీ ఇతర జోన్‌ల ఆధీనంలోనే నడుస్తున్నాయి. జోన్ ఏర్పడితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు మాత్రం ఏసీ గదుల్లో సమీక్షలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జోన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు విశాఖ కేంద్రంగా ఒక్క కొత్త రైలు సర్వీసు కూడా ప్రారంభం కాలేదు. దారి మళ్లించిన రైళ్లు తిరిగి రాలేదు. స్పెషల్ రైళ్ల విషయంలోనూ విశాఖకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ‘జోన్ వచ్చింది.. కానీ ప్రయోజనం ఎక్కడ?’ అనే ప్రశ్న ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.
రూట్ మనది.. రైళ్లు వారివి!
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత కీలక రైల్వే మార్గాలను కలిగి ఉంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే అనేక రైళ్లు ఈ జోన్ పరిధిలోనే ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త రైలు సర్వీసులను ప్రారంభించేది మాత్రం ఇతర జోన్‌లే కావడం గమనార్హం. ఇటీవల కొల్లాం, తిరుచానూరు, తిరువణ్ణామలై, అస్సాం తదితర ప్రాంతాలకు నడిపిన స్పెషల్ రైళ్లలో దాదాపు 70 శాతం మార్గం దక్షిణ కోస్తా జోన్ పరిధిలోనే ఉన్నప్పటికీ, వాటిని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. అదే విధంగా చర్లపల్లి–కొల్లాం స్పెషల్ రైలు గుంటూరు మీదుగా ఈ జోన్‌లోనే ప్రయాణిస్తున్నా, దానిని విశాఖ నుంచి నడపాలన్న ఆలోచన కూడా అధికారులు చేయలేదు. జోన్ ఏర్పడినా కీలక సర్వీసులు విశాఖకు రాకుండా దారి మళ్లడం, కొన్ని రైళ్లు దువ్వాడ వరకే పరిమితం కావడం ప్రయాణికులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఇతర జోన్‌లకు పాత్‌లు కేటాయించే బదులు, విశాఖ నుంచే కొత్త సర్వీసులు ప్రారంభించే అవకాశాలను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హాల్టులు.. అదనపు లైన్లపై నిశ్శబ్దం
జోన్ ఏర్పడిన తర్వాతైనా అదనపు రైల్వే లైన్లు, దారి మళ్లిన రైళ్ల పునరుద్ధరణ, పెండింగ్‌లో ఉన్న హాల్టులపై నిర్ణయాలు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. దువ్వాడ, పెందుర్తి స్టేషన్లలో అదనపు హాల్టులు కల్పించాలన్న డిమాండ్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఈరోడ్–సంబల్‌పూర్ వంటి రైళ్లు దువ్వాడలో కేవలం సిబ్బంది మార్పిడికే ఆగుతున్నాయి. సిబ్బంది వైజాగ్ జోన్‌కు చెందిన వారే అయినప్పటికీ, ఆ రైళ్లు మాత్రం ఇతర జోన్‌ల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. బెంగళూరు దిశగా రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలన్న విజ్ఞప్తులూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.


