ఆచార్యా.. ఇది మీకు తగునా..! | - | Sakshi
Sakshi News home page

ఆచార్యా.. ఇది మీకు తగునా..!

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

● ప్రైవేట్‌ స్కూల్‌ చైర్మన్‌గా ఏయూ రిజిస్ట్రార్‌? ● వర్సిటీ నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు ● గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త

విశాఖ విద్య: ఏయూలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారిపై తీవ్ర స్థాయి అవినీతి, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు విశ్వవిద్యాలయ సర్వీస్‌ రూల్స్‌ పక్కనబెట్టి, స్వలాభం కోసం సమాంతర వ్యవస్థను నడిపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూలో ఉన్నత స్థానంలో ఉంటూ.. వ్యక్తిగత జీఎస్టీఐఎన్‌తో ఏయూ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(ఏయూడీసీ) ఆదాయానికి గండికొట్టడంతోపాటు, ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చైర్మన్‌గా వ్యవహరించడం వర్సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రైవేట్‌ స్కూల్‌ అధినేతగా రిజిస్ట్రార్‌!

రాజమహేంద్రవరంలో ఓక్‌వుడ్‌ స్కూల్‌(సీబీఎస్‌ఈ)ను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రాంబాబు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌, సీబీఎస్‌ఈ బోర్డు పత్రాల ప్రకారం ఆచార్య రాంబాబు ఈ స్కూల్‌ సొసైటీ అధ్యక్షుడిగా, పాఠశాల చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సదరు పాఠశాల డైరెక్టర్లుగా ఆయన కుటుంబ సభ్యులే వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకా విచిత్రమేంటంటే.. ఇదే పాఠశాలకు సంబంధించిన స్ట్రక్చర్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్‌ను ఏయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన మరొక ప్రొఫెసర్‌ జారీ చేయడం గమనార్హం.

వ్యక్తిగత జీఎస్టీఐఎన్‌తో

ఏయూ ఆదాయానికి గండి

వర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు సాయిల్‌ టెస్టింగ్‌, రహదారుల నిర్మాణం, బిల్డింగ్‌ స్ట్రక్చర్‌ స్టెబిలిటీ అండ్‌ సౌండ్‌నెస్‌ వంటి క్వాలిటీ తనిఖీలు చేస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా ఏయూడీసీ ద్వారా జరగాలి. ఇందుకు వసూలు చేసే ఫీజులో 30 శాతం నిధులు కౌన్సిల్‌కి వెళ్తాయి. మిగిలిన 70 శాతం సదరు ప్రొఫెసర్లకు అందుతాయి. ఈ లావాదేవీలన్నీ ఏయూడీసీ అధికారిక జీఎస్టీఐఎన్‌తో జరగాలి. ప్రొఫెసర్‌ రాంబాబు సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నప్పటి నుంచి ఈ నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలున్నాయి. తన పేరిట వ్యక్తిగత జీఎస్టీఐఎన్‌ తీసుకుని, ప్రైవేట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సేవలతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. పదేళ్లకు పైగా ఈ వ్యక్తిగత జీఎస్‌టీఐఎన్‌తో కన్సల్టెన్సీ కార్యకలాపాలు నిర్వహించినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో, నాలుగేళ్ల క్రితం ఆయన ఆ లైసెన్స్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

సమాచారం ఇచ్చేందుకు ఏయూ విముఖత

ప్రొఫెసర్‌ రాంబాబు వ్యక్తిగత జీఎస్‌టీఐఎన్‌, ప్రైవేట్‌ కన్సల్టెన్సీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కోరినా ఏయూ యంత్రాంగం స్పందించడం లేదని ఆర్టీఐ కార్యకర్త జల్లి రాజశేఖర్‌ తెలిపారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ పేరు వాడుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు అక్రమంగా ప్రయోజనం చేకూర్చడం, వర్సిటీ ఆదాయానికి గండి కొట్టడంపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, జారీ చేసిన స్ట్రక్చర్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్లపై లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. రిజిస్ట్రార్‌ స్థానంలో ఆయనే ఉంటే విచారణ సజావుగా సాగదని, ఆయన్ని తప్పించి, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై రిజిస్ట్రార్‌ ఆచార్య రాంబాబును వివరణ కోసం ‘సాక్షి’పలు దఫాలుగా ప్రయత్నించినా ఆయన స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement