సాక్షి, అనకాపల్లి: ’రాష్ట్రపతి ఉత్తర్వులు–2025’ ప్రకారం పోలీస్‌శాఖలో కొత్త జిల్లాలకు స్థానిక క్యాడర్ల కేటాయింపులో హెడ్ కానిస్టేబుల్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇటీవలే పదోన్నతి పొంది ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ శాఖ స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వేదనను మిగులుస్తోంది. రెండేళ్ల కిందటే హెడ్ కానిస్టేబుళ్లగా పదోన్నతి పొందినా వారు జూనియర్‌లుగానే కొనసాగుతున్నారు. ఇటీవల రెండేళ్లుగా సీనియర్ పీసీలు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లేకపోవడంతో రెండేళ్లుగా పనిచేసినా జూనియర్‌లుగానే పరిగణించబడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా రెండేళ్ల పాటు హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేసి, ప్రస్తుతం కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో జూనియర్‌లను ఏజెన్సీకు పంపించే అవకాశం ఉంది. ఇలా ఈ అన్యాయమైన కేటాయింపుల కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెం దిన సుమారు 130 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు తమ సొంత జిల్లాలకు, కుటుంబాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
రెండేళ్లు సర్వీస్ ఉన్నా జూనియర్లే..
గతంలో రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది ట్రైనింగ్ పూర్తి చేసుకుని, కోర్టు స్టే కారణంగా నిలిచిపోయిన సీనియర్ పీసీలుగానే ఉండిపోయిన వారు మైదాన ప్రాంతంలోనే కొనసాగనున్నారు. ఇదే బ్యాచ్‌లో 130 మంది వరకూ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది వెళ్లిన వారు మాత్రం జూనియర్‌లుగా ఉండిపోయారు. హెడ్ కానిస్టేబుళ్లలో కొత్తగా రెండేళ్లుగా కోర్టు స్టే కారణంగా రాకపోవడంతో రెండేళ్ల సర్వీసు ఉన్నా జూనియర్‌లుగానే ఉండిపోయారు. దీంతో కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో ఏజెన్సీకే పరిమితం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో విశాఖ, అనకాపల్లి జిల్లాలు రెండూ జోన్–1లోనూ, అల్లూరి జిల్లా జోన్–2లో ఉండడంతో వీరు అల్లూరి జిల్లాకు వెళితే, వారు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందే వరకూ శాశ్వతంగా ఏజెన్సీలోనే ఉండిపోనున్నారు. కాగా వీరిలో అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన వారూ కూడా శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు దూరం కానున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1000 మంది హెచ్‌సీలు
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1000 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇటీవలే (రెండేళ్ల క్రితం) కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారు 130 మంది వరకూ ఉన్నారు. అయితే, నూతన జిల్లాల ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను స్థానిక కేడర్ కేటాయించాల్సి ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అనకాపల్లి, విశాఖ జోన్–1లోకి, అల్లూరి జిల్లా జోన్–2లోకి విభజించారు. అయితే రివర్స్ సర్వీస్ ప్రకారం కేటాయింపులు జరుగుతున్నాయి. రెండేళ్ల పాటు సీనియారిటీ ఉన్నా వారు జూనియర్‌లు గానే పరగణిస్తున్నారు. దీంతో వీరు ఏజెన్సీకే పరిమితం కానున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు ఏజెన్సీకి కేటాయింపు జరగడం కారణంగా జోన్‌లు మారిపోతున్నాయ. శాశ్వతంగా సొంత ప్రాంతాలకు దూరంగా కానున్నారు. జోన్–2లో అల్లూరి జిల్లా, రంపచోడవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లాలున్నాయి. వారికి ఏఎస్‌ఐగా పదోన్నతి వచ్చినా జోన్–2కే పరిమితం కానున్నారు. వారికి వెసులుబాటు కల్పించకపోతే దీని వల్ల వారి కుటుంబాలు, పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల వైద్య సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాకు స్థానిక కేడర్ కేటాయింపు
స్పీకర్, డీఐజీకి వినతి
కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో నష్టపోతున్న హెడ్ కానిస్టేబుళ్లు తమ సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. తమకు అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డీఐజీ గోపినాథ్ జెట్టీకి విన్నవించుకున్నారు. రెండేళ్ల పాటు చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని స్థానిక కేడర్ కేటాయింపులు జరపాలని కోరారు. డీఎల్పీ కమిటీ పరిశీలనలోనూ తమకు న్యాయం జరగకపోతే, ఈ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ’రిట్ పిటిషన్’ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కమిటీలో ఉన్నది వీరే..
ఉద్యోగులను పాత, కొత్త జిల్లాల మధ్య పారదర్శకంగా కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చైర్మన్‌గా ఉంటారు. కో–చైర్మన్‌లుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ టి.నిశాంతి వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఐజీ గోపినాథ్ జెట్టీ, కొత్త జిల్లా అధికారి కో–కన్వీనర్‌గా జిల్లా ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్ బర్దర్ ఉంటారు. ఆగస్టు 5వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తవ్వాలనేది ప్రభుత్వ నిబంధన.
ఏకపక్ష వైఖరితో నష్టం
సాధారణంగా స్థానిక కేడర్ లేదా స్థాన చలనం ప్రక్రియలో సర్వీసు, సీనియారిటీ, హెచ్‌ఆర్‌ఏ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో లోపాలు, అధికారుల ఏకపక్ష వైఖరితో ఉమ్మడి జిల్లాలోని మొత్తం హెడ్ కానిస్టేబుళ్లలో దాదాపు 130 మంది హెడ్ కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోతున్నారు.


