రెడ్‌బుక్ రాజ్యంలో
రాక్షస పాలన
అనకాపల్లి: కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలోనే మహిళపై అఘాయిత్యం జరిగినప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడేడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, భీమునిగుమ్మం అంబేడ్కర్ విగ్రహం వరకూ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మహిళపై చెప్పలేని ఘోరం జరిగిందని, నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేదని రాష్ట్ర హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలన్నారు. మహిళలు స్కూల్ నుంచి గుడి వరకూ వెళ్లాలంటే భయపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మంత్రి నారా లోకేష్ మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజ్వరేషన్ బిల్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే, మన రాష్ట్రంలో మహిళలపై దాడులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి అధికార దాహంతో ఊగిపోతున్నారన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా వర్కింగ్ జోన్–1 అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల అరాచక పాలనపై ప్రజలు విరక్తి చెందారన్నారు. సరైన సమయంలో ఓటు ద్వారానే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మహిళలపై దాడులు చేసిన వ్యక్తులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంపీ మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, సీరం నదియా, మహిళా నాయకులు పద్మకుమారి, పద్మ, సుందరిలత, హైమావతి, శ్రావణి, సీతారత్నం, నూకరత్నం, విజయ లక్ష్మీ, లక్ష్మి పాల్గొన్నారు.


