గొలుగొండ: కష్టాల్లో ఆగాకర రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలో ఎక్కవగా గొలుగొండ మండలంలో ఈ ఆగాకర సాగు జరుగుతుంది. అనుకూలమైన నేలలు ఉండడంతో ఎకరం రూ.లక్ష వర కు పెట్టుబడులు పెట్టి సాగు చేపడితే తీరా కాపు దశ లో వర్షం వెనుకంజ వేసింది. మండలంలో ఈ సాగు అన్ని ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో సాగు జరుగుతుందంటే ఈ ప్రాంతంలో అనుకూలమైన నేలలు ఉండడమే కారణం. మండుటెండలో ఏప్రిల్ నుంచి పా దులు పెంచుకుంటూ వేలాది రూపాయలు పెట్టు బడులు పెడితే కాపు దశలో చినుకులు లేక 25 శాతం మాత్రమే కాయలు రావడంతో రైతులు లబోదిబో అంటున్నారు.
1500 ఎకరాల్లో సాగు
గొలుగొండ మండలంలో వరి సాగు తరువాత ఈ సీజన్‌లో ఆగారక సాగు ఎక్కవగా జరుగుతుంది. కొత్త ఎల్లవరం, రాజుపేట, కరక, జిల్లెడిపూడి, గొలుగొండ, జోగుంపేట, పప్పుశెట్టిపాలెం, అమ్మపేట, చీడిగుమ్మల, ఎర్రవరం తదితర ప్రతీ గ్రామంలో వందలాది ఎకరాలు కనుచూపు మేర ఆ పంట వేస్తారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో ఈ పంటకు పాదులు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు పోసి పాదులు పెంచడం జరుగుతుంది. జులై మొదటివారం నుంచి పంట దిగుబడి వస్తుంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ సాగు విస్తారంగా జరగడంతో రైతులకు లాభాలు వచ్చేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా కాపు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఎకరానికి రూ. లక్ష వరకు పెట్టబడి
ఆగారక సాగుకు అధికంగా పెట్టుబడులు అవుతుంటాయి. మండు వేసవిలో పాదులు పెంపకం, పాదులు పెరుగుతున్న సమయంలో పందిళ్లు వేయడం, ఆడ, మగ పాదులు వేరు చేయడం, ఎరువులు, పురుగు మందులకు అధికంగా పెట్టుబడులు అవుతుంటాయి. రైతులు మొదటి రెండు దఫా కాపులోనే ఈపెట్టుబడులు వచ్చేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా పాదులు ఎదుగుదల దశలో వానల్లేక దిగుబడి దెబ్బతీసింది. దీని వల్ల కాపు 25శాతం మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే రూ. 3 లక్షల దాటి ఆదాయం వచ్చేదని చెబుతున్నారు.
అనుకూలమైన నేలలు
ఆగారక సాగుకు ఎర్ర నేలలు ఉండాలి. నీరు ఎక్కువగా ఉండకుండా, ఆరుతడిగా ఉన్న నేలల్లో మంచి పెరుగుదల వస్తుంది. ఈ రకం నేలలు ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఎకరం రూ.25వేల వరకు శిస్తులకు భూములు సాగు చేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి నేలలు మండలంలో పై గ్రామాల్లో ఉండడం వల్ల ఈ సాగు ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం తీవ్ర వర్షభావ పరిస్థితుల కారణంగా నష్టాలు చూడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.
ఎండిపోతున్న పాదులు
ఈ సీజన్‌లో మంచి వర్షాలు కురవడం వల్ల పాదులు విస్తారంగా పెరిగి కాయలు అధికంగా వచ్చేవి. మండుటెండలో ట్యాంకర్లతో నీరుపోసి పాదులు పెంచినా పాదులు పెరిగే సమయంలో వర్షం లేక పాదులు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం కాయలకు ధర ఉన్నా దిగుబడులు లేక తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.
–గోవింద్, రాజుపేట, రైతు
ధరలు బాగున్నా, దిగుబడులు లేక
ప్రస్తుతం రైతుల వద్ద పండిన ఆగారక కిలో రూ.150 నుండి 160 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ధరలు టన్ను కాయలకు రూ. లక్షా 50వేల వరకు ఆదాయం వస్తున్నా కాపు లేకపోవడంతో రైతలకు నష్టాలే వచ్చే అవకాశం ఎక్కవగా ఉంది. ఎకరానికి రూ. 50వేల వరకు నష్టం వస్తుందని రైతులు అంటున్నారు.
నిలిచిన ఎగుమతులు
ఆగారక సాగు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు అయిన ఒడిశా, పశ్చిమబంగా, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ ప్రాంతాలకు ప్రతి ఏటా ఎగుమతులు ఉండేవి. వ్యాపారులు రైతులకు అడ్వాన్సులు ముందుగా ఇచ్చి వ్యాపారం చేసే వారు. కానీ ఈ ఏడాది కాయలు దిగుబడి లేక ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఉన్న కాస్త కాయలు ఇక్కడికే అమ్మకాలు జరుగుతున్నాయి.


