వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరిక
అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుని తీరుతాం
వెంటనే ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలి
సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే తవ్వకాలు
సనాతన ధర్మమంటూ ఊదరగొట్టిన డిప్యూటీ సీఎం ఎక్కడ?
శివుడు మూడో కన్ను తెరిస్తే కొట్టుకుపోతారని ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ ధర్మ పోరాటం యాత్ర విజయవంతం
సాక్షి, అనకాపల్లి : హిందూ దేవాలయాలున్న కొండలపై అక్రమ గ్రావెల్ మైనింగ్‌ను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని, కూటమి అనకొండల భరతం పడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదార్ల కొండలను పిండిచేస్తూ అక్రమ సంపదను ఆర్జిస్తున్నారని చంద్రబాబు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. కూటమి పార్టీల నేతల మైనింగ్ దోపిడీకి నిరసనగా వైఎస్సార్‌సీపీ మంగళవారం చేపట్టిన ‘చలో పంచదార్ల’ ధర్మ పోరాట యాత్రకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
వందలాది కార్లు, వేలాది బైకులతో అనకాపల్లి రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి పూడిమడక జంక్షన్, మునగపాక, అచ్యుతాపురం మీదుగా రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామం వరకు 20 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. అక్కడ అక్రమంగా తవ్విన గ్రావెల్ గుంతలను శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, కేకే రాజు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, పార్టీ నేతలు పెట్ల ఉమాశంకర్ గణేశ్, కంబాల జోగులు, మలసాల భరత్‌కుమార్, మొల్లి అప్పారావు, అన్నంరెడ్డి అ«దీప్‌రాజ్, అనకాపల్లి పరిశీలకులు శోభా హైమావతితో పాటు పలువురు ముఖ్య నేతలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కె.భ్యాగలక్ష్మి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, సతీష్వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలి
కూటమి ప్రభుత్వ అక్రమ గ్రావెల్ తవ్వకాలను యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే ’చలో పంచదార్ల’ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. కూటమి నేతలు దశాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర శివుని దేవాలయాన్నే దోచుకుంటున్నారు. దేవాలయ సంరక్షణ, సనాతన ధర్మం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం కాదా.. ఇది చేతగాని ప్రభుత్వమా? ధర్మలింగేశ్వర స్వామి మూడో కన్ను తెరిస్తే ఈ కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది.
రేపటికల్లా మైనింగ్‌కు సంబంధించిన ఒక్క వస్తువు కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. తక్షణమే పంచదార్లను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ పోతుంటే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. కేజీఎఫ్ తరహాలో కొండను 125 అడుగుల లోతు తవ్వేయడం దారుణం. ప్రశ్నించే వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగుతారా? పవిత్రమైన పంచదార్ల కొండను బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఇద్దరూ తొలి చేస్తున్నారు. ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం రాకపోతే తానే స్వయంగా వస్తానని వైఎస్ జగన్ చెప్పారు. గతంలో రుషికొండపై ప్రభుత్వ భవనం కడితే దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పంచదార్ల దైవక్షేత్రం కొండలను పిండి చేస్తుంటే ఏం చేస్తున్నారు? సనాతన ధర్మం ఏమైంది? సీఎం రమేష్ అంటే కరపె్టడ్ మేన్. ఉమా ధర్మలింగేశ్వరస్వామితో పెట్టుకుంటే మాడి మసైపోతారు.


