మునగపాక : పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని ప్రతీ ఒక్క భక్తుడు కాపాడుకోవాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే చలో పంచదార్ల కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఽఅధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్ల కొండను పిండేస్తూ కూటమి నేతలు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేయడం వల్ల పవిత్రమైన ధార బురదమయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన పాలకులు కొండలను పిండేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు.
ఈ సమస్యపై కొంతకాలంగా నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పలు రూపాల్లో పోరాటం చేస్తున్నారన్నారు. కొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. అక్రమార్జనే ధ్యేయంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన అనుచరుల ద్వారా కొండను తవ్వేస్తూ పంచదార్ల ఆలయానికి అపవాదు తీసుకువస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 21వ తేదీన వైఎస్సార్‌సీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ పెద్దలు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పంచదార్లలోని శివునికి పూజలు నిర్వహించి అనంతరం మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారన్నారు. ఇందుకోసం మునగపాక మండలం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు,మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు,ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, పార్టీ నేతలు షేక్ ఇస్మాయిల్, నరాలశెట్టి సూర్యనారాయణ,పెంటకోట హరేరామ, బొద్దపు శ్రీరామమూర్తి,పెంటకోట అప్పలనాయుడు,టెక్కలి కొండలరావు,దిమ్మల అప్పారావు,భీశెట్టి గంగప్పలనాయుడు,బొడ్డేడ బుజ్జి, శ్రీపతి రామకృష్ణ,చదరం నాయుడు,చదరం అప్పలనాయుడు, పొలమరశెట్టి జగదీష్, రాపేటి పరమేష్, వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్


