మాడుగుల : మాడుగుల మండలం ఘాట్‌రోడ్ జంక్షన్‌లో వెలసిన మోదకొండమ్మ పాదాలు ఘటాలు పండగ ఆదివారం వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంక్షన్‌లో గల వర్తక సంఘం సభ్యులు అమ్మవారి ప్రతి రూపమైన 101 ఘటాలతో డప్పులు వాయిద్యాలతో జంక్షన్ నాలుగు కూడలిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర మండుటెండలో అడుగులో అడుగులు వేసి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శేనాపతి కొండలరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిని ఆలయ కమిటీ దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించింది. భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మజ్జిగ అందజేశారు.
101 ఘటాలతో బారులు తీరిన భక్తులు


