అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌లు కొండలను పిండి చేసేస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, మైనింగ్ మంత్రికి అనేక పర్యాయాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టినట్టు వైస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త, కరణం ధర్మశ్రీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్రతో కలిసి ఈనెల 21న అనకాపల్లి రింగ్ రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మునగపాక, అచ్చుతాపురం మీదుగా పంచదార్ల ఫణిగిరి కొండ వద్దకు ర్యాలీ నిర్వహించం జరుగుతుందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో లేటరేట్ ఖనిజ సంపద, చోడవరం నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలు, శారదానది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక, పోలవరం ఎడమకాలువ గట్టుపై గ్రావెల్ తవ్వకాలతో కూటమి నాయకులు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పంచదార్ల కొండను 150 అడుగుల్లో తవ్వకాలు చేశారని, కడప జిల్లాకు చెందిన ఎర్రగుట్లు గ్రామానికి చెందిన సీఎం రమేష్ డ్రైవర్ అయిన విజయకుమార్ పేరు మీద కొండను దోచేస్తున్నారన్నారు. ఫణిగిరి కొండ పక్కనే ఉన్న మరో ఐదున్నర ఎకరాల కొండను లక్ష్మీనరసింహ మినరల్స్(వై.శ్రీనివాసరావు పేరుమీద) స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ బినామీ పేరుతో దోచేస్తున్నారన్నారు. ఫణిగిరి కొండను 150 అడుగులు తవ్వేయడం వల్ల జల ధారలు రావడం లేదని పురావస్తుశాఖ వారు కలెక్టర్‌కు తెలియజేయడం జరిగిందన్నారు. సనాతన ధర్మం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అనేక పర్యాయాలు చెబుతుంటే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీ ఎక్కడ పాటిస్తున్నారో చెప్పాలన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షిస్తా మని చెప్పిన బీజేపీ పంచదార్ల కొండను ఎందుకు కాపాడడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, 80,81 వార్డు ఇన్‌ఛార్జ్‌లు కెఎం.నాయుడ, బొడ్డేడ శివ, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, నాయకులు కలగలక్ష్మీ గున్నయ్యనాయుడు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ


