తుమ్మపాల: రాంబిల్లి మండలం పంచదార్లలో జరుగుతున్న మైనింగ్‌పై ఒక కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’ గా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలో మంజూరు చేసిన రోడ్లను రాబోయే పదిహేను రోజుల్లో ప్రారంభించాలని, అలా చేయని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆధ్వర్యంలో డీఆర్‌సీ సమావేశం జరిగింది. ఇరిగేషన్, తాగు నీరు, రోడ్లు భవనాలు, జల్‌జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ పనులు, ఏపీఐఐసీ, పంచాయతీ రాజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యవసాయ శాఖ, మున్సిపాల్ శాఖల పై సమీక్ష జరిగింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి, వినియోగంలోకి తీసురావాలన్నారు. జిల్లాను వ్యవసాయ రంగం తోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి బాటలో నిలిపేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రమికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేబాధ్యత అధికారులపై ఉందన్నారు. వివిధ శాఖల పరిధిలో ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, సీపీవో జి.రామారావు,అనకాపల్లి ఆర్డీఓ షేక్ అయేషా, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.


