సామాన్యుల చెంతకు న్యాయం
బోథ్: న్యాయం కేవలం కోర్టు గదులకే పరిమితం కాదని, సామాన్యుల చెంతకు చేరుతుందని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కుంభ సందీప్ నిరూపించారు. కోర్టులో మంగళవారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు పవర్ పాండు అనే వ్యక్తి వచ్చాడు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉండడం గమనించిన న్యాయమూర్తి స్వయంగా కోర్టు బయటకు వచ్చి సాక్షి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో సామాన్యులకు చేరువగా న్యాయం అందించే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైందన్నారు. బాధితులు, సాక్షుల ఇబ్బందులు అర్థం చేసుకోవడం ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. కోర్టు చరిత్రలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని అక్కడి వారు ప్రశంసించారు. ఇందులో ఏపీపీ శ్రీధర్, న్యాయవాది దమ్మాపాల్, కోర్టు కానిస్టేబుల్ అంబాజీ పాల్గొన్నారు.


