హస్తం గురి
‘పరిషత్’ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు జిల్లా, మండల కమిటీల పటిష్టానికి అధిష్టానం ఆదేశం సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
సాక్షి,ఆదిలాబాద్: ‘పంచాయతీ ఎన్నికల్లో మరింత కష్టపడి ఉంటే జిల్లాలో ఎక్కువ సర్పంచ్ స్థానాలు వచ్చేవి.. సమన్వయంతో ముందుకెళ్లకపోవడంతోనే ఈ పరిస్థితి.. పార్టీ గుర్తుపై జరిగే పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఇది పునరావృతం కాకూడదు.. మంచి ఫలితాలు సాధించాలి.. అందరిని కలుపుకొని వెళ్లాలి.. ’ డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌లో కలిసినప్పుడు చేసిన దిశానిర్దేశం ఇది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోనూ రానున్న పరిషత్ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు. హస్తం పార్టీ సాధించిన ఫలితాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత కష్టపడి ఉంటే ఎక్కువ స్థానాలు వచ్చేవని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా.. లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికలు చేపడతారా అనే తర్జనభర్జన వివిధ రాజకీయ పార్టీలు, శ్రేణుల్లో వ్యక్తమవుతుండగా, పరిషత్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుందనే సంకేతాలు కాంగ్రెస్ సమావేశాల ద్వారా స్పష్టమవుతున్నాయి.
తక్షణ కర్తవ్యం..
పరిషత్ ఎన్నికలను త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుండడం, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై హస్తం నేతలు దృష్టి సారించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం పార్టీ జిల్లా, మండల కమిటీలను నియమించాలని పేర్కొన్నారు. తద్వారా పార్టీ గుర్తుపై జరిగే పరిషత్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ముందుకెళ్లాలని అధిష్టానం సూచించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ ఈ విషయంలో దృష్టి సారించారు. అధిష్టానం ఆదేశాల మేరకు కమిటీల రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నారు. జిల్లా ముఖ్య నేతలందరినీ సమన్వయం చేసుకోవడం ద్వారా కమిటీల ఏర్పాటులో ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
పంచాయతీ ఫలితాలపై ఆరా..
ఇటీవల జిల్లా నేతలు హైదరాబాద్‌లో సీఎంతో పాటు ముఖ్య నాయకులను కలిసినప్పుడు పంచాయతీ ఫలితాలపై ఆరా తీశారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గానికి సంబంధించి జిల్లా నేతలు ఇచ్చే నివేదికలను పరిశీలిస్తూనే, సీఎం తనవద్ద ఉన్న ఫలితాలను సరిపోల్చుకున్నట్లు నేతలు చెబుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు సాధించారనేది సీఎం దగ్గర పూర్తిస్థాయి నివేదిక ఉందని చెబుతున్నారు. దాని ఆధారంగానే జిల్లా ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరింత కష్టపడి ఉన్నత ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేసినట్లు జిల్లా నేతలు తెలుపుతున్నారు.


