ఆదివాసీల ఆందోళన
కై లాస్‌నగర్: రియల్టర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పట్టణంలోని కుమురంభీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ మాట్లాడుతూ, సర్వేనంబర్ 170లోని కుమురంభీం కాలనీలో ఆదివాసీలు గుడిసెలు వేసుకుని ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే పట్టణానికి చెందిన పలువురు రియల్టర్లు రాత్రి వేళలో కాలనీకి వచ్చి భూమి తమదని, ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై వెంటనే చట్టపరంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఆదివాసీ నాయకులు వెట్టి మనోజ్, సలాం వరుణ్, గోడం రేణుకబాయి, ఉయిక ఇందిరా, లలిత, గణపతి, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.


