బకాయిలు చెల్లించకుంటే.. ఆస్తులు జప్తే
(రూ.లలో)
కై లాస్‌నగర్: సీ్త్రనిధి బకాయిల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుణాలు తీసుకు న్న స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటిని తిరిగి చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం బకాయిదారులపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్)యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ సెక్రటరీ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు బకాయిలు చెల్లించని వారి ఆస్తులను అధికారులు జప్తు చేయనున్నారు.
రూ.22.44కోట్ల బకాయిలు
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తోంది. వివిధ వ్యాపారాలు నిర్వహించేందు కోసం ఒక్కో సభ్యురాలికి రూ.30వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు అందజేస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. అయితే దీని కింద రుణాలు తీసుకున్న సభ్యులు కొందరు నెలల తరబడి చెల్లించడం లేదు. దీంతో అవి మొండి బకాయిలుగా మిగిలాయి.
ఆర్‌ఆర్ యాక్ట్ అమలు..
మొండి బకాయిలు కలిగిన సభ్యులు త్వరగా చెల్లించాలని సెర్ప్, మెప్మా అధికారులు సూచిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది ద్వారా పదేపదే అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు సభ్యులు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వాటి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలని భావించి ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఈ యాక్టు అమలు ద్వారా బకాయిదారులకు సంబంధించిన భూమి, ఇళ్లు వంటి ఇతరత్రా ఆస్తులను జప్తు చేస్తారు. తహసీల్దార్, పోలీస్ సిబ్బందితో కలిసి బకాయిపడ్డ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారి ఆస్తులు జప్తు చేసి బహిరంగ వేలం వేయనున్నారు. వాటి ద్వారా వచ్చే డబ్బులను సీ్త్ర నిధి బకాయిల కింద చెల్లించనున్నారు. ఒకవేళ సభ్యురాలి పేరిట ఎలాంటి ఆస్తి లేనట్‌లైతే వాటిని చెల్లించాల్సిన బాధ్యత గ్రూప్ సభ్యులందరిపై ఉంటుంది. గ్రూప్ సభ్యుల ఆస్తులు సైతం జప్తు చేయనున్నారు. దీని అమలుకు జిల్లా సీ్త్రనిధి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి విషయాన్ని తెలియజేసి అనుమతి తీసుకున్నారు. తద్వారా మొండిబకాయిలు వసూలయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మండలాల వారీగా పేరుకుపోయిన
సీ్త్రనిధి బకాయిల వివరాలు ...
మండలం సభ్యులు బకాయిలు
ఆదిలాబాద్‌అర్బన్ 5,077 3,77,32,423
గుడిహత్నూర్ 1,025 2,49,67,677
జైనథ్ 1,313 2,15,65,879
ఉట్నూర్ 1,651 1,72,98,166
ఆదిలాబాద్ రూరల్ 770 1,37,94,533
ఇచ్చోడ 729 1,37,90,643
నేరడిగొండ 1,091 1,11,93,403
ఇంద్రవెల్లి 631 1,06,32,071
బజార్‌హత్నూర్ 1245 90,87,628
బోథ్ 1,787 70,18,933
భీంపూర్ 534 64,79,956
తలమడుగు 498 60,58,943
నార్నూర్ 449 50,19,793
తాంసి 313 43,48,076
సిరికొండ 353 31,43,144
మావల 131 25,89,960
బేల 335 25,89,960
గాదిగూడ 116 10,92,664
జిల్లాలో..
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు : 18,048
వీరికి అందజేసిన సీ్త్రనిధి రుణాలు : రూ.131.75కోట్లు
కిస్తీల రూపేణ వసూలు కావాల్సింది : రూ.40.75కోట్లు
ఇప్పటి వరకు వసూలైంది : రూ.18.31కోట్లు
బకాయిలు : రూ.22.44 కోట్లు
స్వచ్ఛందంగా చెల్లించాలి
స్త్రీనిధి బకాయిల వసూళ్లకు ఆర్‌ఆర్ చట్టం ప్ర యోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు సైతం అనుమతినిచ్చారు. ఈ మేరకు బకాయిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెల్లించాలి. లేని పక్షంలో ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. – పూర్ణచందర్,
సీ్త్రనిధి రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్


