‘టెన్’షన్ వద్దు
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. మోటివేట్ చేయడానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారని, 9948878800 నంబర్‌లో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ సుజాత్ ఖాన్, సెక్టోరియల్ అధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


