నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. జిల్లా పరిషత్ నిధులతో తయారు చేసిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్‌ను మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువే ఆయుధంగా విద్యార్థులు విద్యనభ్యసించాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌కు పునాది అని, పటిష్టంగా నిర్మించుకోవాలని హితబోధ చేశారు. డీఆర్‌ఓ చిన ఓబులేసు మాట్లాడుతూ విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పరీక్షల పట్ల భయం వీడి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మనాయక్ మాట్లాడుతూ నిష్ణాతులైన అధ్యాపకులతో స్టడీ మెటీరియల్‌ను తయారు చేయించామన్నారు. కార్యక్రమంలో సహాయక సాంఘిక సంక్షేమ అధికారి రబియా, సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


