ప్రజల జీవనోపాధులు మెరుగుపరచాలి
ఒంగోలు వన్‌టౌన్: పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధులు మెరుగుపరిచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జల సురక్ష, పెన్షన్ల పంపిణీ, బ్యాంకు లింకేజీ, ఇంటిపన్నులు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై మంగళవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు వినూత్న ఆలోచనలతో మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చేలా దుకాణాలు నిర్మించాలని సూచించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వ్యాపార కూడళ్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి మెప్మా ద్వారా పట్టణ మహిళలకు కేటాయించాలని సూచించారు. జల సురక్ష మాసంలో భాగంగా తాగునీటి పథకాలు, పైపులైన్ల మరమ్మతులు నూరుశాతం పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మైక్రో క్రెడిట్ ప్లాన్‌కు అనుసంధానంగా బ్యాంక్ లింకేజీ రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన మైక్రో క్రెడిట్ ప్లాన్ 43 శాతం మాత్రమే గ్రౌండింగ్ పూర్తయిందని, నూరుశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీ్త్ర నిధి రుణ రికవరీలు నూరుశాతం వసూలు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, సీపీఓ సుధాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి లక్ష్మనాయక్, డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


