ప్రభుత్వ బడి బలోపేతమే లక్ష్యం
● ప్రైవేట్‌కు దీటుగా వసతుల కల్పన ● డిజిటల్, ఏఐ ద్వారా విద్యాబోధన ● ‘బడిబాట’పై స్పెషల్ ఫోకస్ ● టీచర్ల సర్దుబాటుకు కసరత్తు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. ప్రైవేటుకు ధీటుగా అన్ని వసతులు అందుబాటులో ఉంచుతున్నాం.. డిజిటల్ తరగతులు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా కూడా విద్యాబోధన అందిస్తున్నాం. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచడంపై ఫోకస్ పెంచాం.. బడిబాటను పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశాం.. నాణ్యమైన బోధనే లక్ష్యంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం పూర్తి చేశాం.. పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. అని డీఈవో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలేంటి?
డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. మరింత నాణ్యమైన విద్యాబోధన కోసం వారికి ఈ వేసవిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులతో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్‌బుక్స్, కంప్యూటర్ విద్యతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ వారి హాజరు పెంచేందుకు కృషి చేస్తున్నాం.
సాక్షి: విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..?
డీఈవో: బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రోత్సహిస్తున్నాం. గతేడాది ప్రవేశాలు తగ్గిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంటుంది. దీనిని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
సాక్షి: పాఠశాలల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు..?
డీఈవో: పాఠశాలల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా మండల విద్యాధికారులు, ఉపాధ్యాయుల ద్వారా అవసరమైన మౌలిక వసతుల వివరాలను సేకరించాం.వాటిని ఉన్నతాధికారులకునివేదించాం.నిధులు మంజూరు రాగానే పనులు చేపడతాం.అలాగే విద్యా ప్రమాణాలపై పర్యవేక్షణ పెంచాం.
సాక్షి: జిల్లాలో మూతబడిన పాఠశాలలను తెరిచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
డీఈవో: జిల్లాలో 12 పాఠశాలలు మూతబడ్డాయి. వీటిలో ఒక ఉన్నత పాఠశాల ఉంది. ప్రస్తుతం బడిబాట లో భాగంగా నాలుగు ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు చర్యలు చేపడుతున్నాం. నేరడిగొండ, నార్నూర్‌లో ఒక్కోటి చొప్పున, ఆదిలాబాద్‌అర్బన్‌లో 2 పాఠశాలలు పునఃప్రారంభించేలా చూస్తున్నాం. ఈ పాఠశాలలకు అవసరమైన మౌ లిక వసతులు, ఉపాధ్యాయులను నియమిస్తాం.
సాక్షి: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉందా.. సర్దుబాటు చేపడుతున్నారా..?
డీఈవో: మెగా డీఎస్సీ ద్వారా జిల్లావ్యాప్తంగా 236 పోస్టులు భర్తీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 3067 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు ఉండగా, 2,667 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు చేపడతాం. ఈమేరకు వివరాలు పంపించాలని ఎంఈవోలను ఆదేశించాం. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుంది. సర్‌ప్లేస్ ఉన్నచోట ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేస్తాం.
సాక్షి: తల్లిదండ్రులకు మీరిచ్చే భరోసా ఏమిటి..?
డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి భవిష్యత్తును మెరుగుపర్చాలి. అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తాం.
సాక్షి: గతేడాది యూనిఫాం, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
డీఈవో: పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో 62,282 మంది విద్యార్థులున్నారు. మొదటగా ఒక జత ఇస్తాం. 45 శాతం కుట్టు పని పూర్తయ్యింది. జిల్లాకు 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల 65వేల 221 వచ్చాయి. 3లక్షల 72వేల 200 పుస్తకాలను ఎంఈవో కార్యాలయాలకు పంపించాం. మండల విద్యాధికారులు 2లక్షల 79వేల 150 పుస్తకాలను ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు.
ప్రభుత్వ బడి బలోపేతమే లక్ష్యం


