‘అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి’
కై లాస్‌నగర్: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదవుతున్నాయని, చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేలో సెలవులు ప్రకటిస్తామన్న మంత్రి సీతక్క హామీని నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే సర్క్యూలర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నన్న, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు రత్నమాల, ముక్త, ప్రమీల, సుభద్ర, అనసూయ, నజీమా, లక్ష్మి, భాగ్యశ్రీ పాల్గొన్నారు.


