● వీసీలో రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్
కైలాస్‌నగర్: ఓటరు స్లిప్పుల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి న స్థానిక యువతను వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేసి పంపిణీ చేయాలన్నారు. పర్యవేక్షణకు గాను నోడల్ అధికారిని నియమించాలన్నారు. ఈ విషయంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.