breaking news
-
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడు
కర్నూలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ(70), కుమారుడు జమ్మన్న నివాసముంటున్నారు. జమ్మన్న వంట మాస్టర్‌గా పనిచేస్తూ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గురువారం రాత్రి తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున ఒంటరిగా పడుకుని ఉన్న తల్లి చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నాడు. అనంతరం ముక్కు మూసి హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. జమ్మన్న కూతురు జ్ఞానేశ్వరి ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్‌రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్.. నాలుగు రోజులుగా రెక్కీ..
రంపచోడవరం: సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సోయం శ్రీసౌమ్య ఉదయం 10.30 గంటలకు రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యారు.ఈ క్రమంలో వేటుకూరుకి చెందిన కె.అనిల్‌కుమార్ మరికొందరి సహాయంతో AP31TJ1462 నంబరు గల ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి, బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందూ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. -
విశాఖలో విషాదం
విశాఖ సిటీ: విశాఖ వన్‌టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు. వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి. వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్‌టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్‌కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
హరిత నన్ను క్షమించు..
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు. -
పలమనేరులో మహిళ దారుణ హత్య!
చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు. -
కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వద్దంటే వినరా.. టెకీ ఆత్మహత్య
జె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేశారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
నవ వధువు, శ్రీ చైతన్య లెక్చరర్ ఆత్మహత్య.. కారణం అదేనా?
సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు. -
తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్‌ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్‌ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
వాటిని తెరిస్తే తంటాలే..!
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ -
ఇంజినీ‘రింగ్ రింగ’
తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్‌కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్‌టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్‌లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్‌రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు. -
పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి..
సాక్షి, కోనేరు సెంటర్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక దుర్మార్గమైన పంచాయితీకి తెరతీశారు. యువతిని మోసగించిన టీడీపీ నేత, మంత్రి అనుచరుడి కుమారుడి తరఫున రంగంలోకి దిగారు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల్లో ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్‌ను గోవాలో పట్టుకున్నారు. అతడిని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి, యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువతి తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందనే భయంతో ఆ యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. -
ఎస్బీఐలో రూ.12 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ
హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్‌లో జరిగిన భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సమయంలో బ్యాంకులో భారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హిందూపురం డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాoకు లాకర్లో ఉన్న దాదాపు రూ.12 కోట్ల విలువచేసే 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బ్యాంకు లాకర్ గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించినా కింది అర లాక్ తెరుచుకోలేదనీ, గట్టిగా ఉండటంతో తెరవలేక పోయారన్నారు. లేదంటే మరో పదికేజీల బంగారం కూడా చోరీకి గురయ్యేదన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రత్నం మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమా? అయితే ఈ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు లేకపోవడం, లోపల అలారం పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను బ్యాంకు అధికారుల సెల్ఫోన్లకు అనుసంధానించకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ఇటీవల తనిఖీల నిమిత్తం హిందూపురం రూరల్ సీఐ పారిశ్రామికవాడలో తనిఖీలకు వచి్చన సందర్భంగా బ్యాంకు భద్రతపై అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ పటిష్టం చేయాలని సూచించారు. అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. -
కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
ఆగని టీడీపీ నేత అకృత్యాలు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్‌కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్‌కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్‌కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్‌కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్‌లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్‌లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్‌కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్‌లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్‌ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్‌ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్‌గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్‌గా ఆమె ఎదిగడం కొసమెరుపు. -
ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్‌కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్‌ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్‌ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు.