breaking news
-
రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం
విశాఖపట్నం : బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైసూ్కల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్ (19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడ లో ఉంటున్న తాతగారి ఇంటికి వెళ్తుంటాడు. పలాస కు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది. తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్‌పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్‌పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైసూ్కల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాము తెలిపారు. -
ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు.. చనిపోతా!
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో... నన్నే దోషిగా చిత్రీకరిస్తున్నారు. ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. సరిగానే పనిచేస్తున్నానని చెబుతున్నా, అందరితో సంతకాలు పెట్టిస్తూ... నాకు మద్దతిచ్చినవారిని భయపెడుతున్నారు.ఇక పోరాడే శక్తి లేదు. చనిపోదామని నిర్ణయించుకున్నా’’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య వాపోయారు. తన బాధను బయటకు చెప్పడమే తప్పా? అని ప్రశ్నించారు. దళిత మహిళా ఉద్యోగి అయిన సౌమ్య... సోమవారం శ్రీకాకుళం తిలక్‌నగర్‌లోని నివాస గృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన, ఆయన అనుచరుల వేధింపులు తాళలేక జీవితాన్ని చాలించాలని అనుకున్నట్లు తెలిపారు. బాధితురాలు సౌమ్య, వారి కుటుంబ సభ్యులు, రిమ్స్ వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాక బెడ్రూమ్లోకి వెళ్లిన సౌమ్య బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగారు.బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. పనిమనిషి అప్పన్న నీళ్లు తాగమని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్లి చూశారు. మందులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో సౌమ్య తల్లి సద్విలాసిని, డ్రైవర్ శివకు చెప్పారు. రిమ్స్‌లో గైనిక్ ప్రొఫెసర్, సౌమ్య సోదరి రేజేటి శిరీషకు ఫోన్ చేశారు. అప్పన్న, శివ తక్షణమే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న సౌమ్యకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చాక సౌమ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము వెల్లడించారు. ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. సురేష్‌తో పాటు భార్యాపిల్లలు కూడా స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే మనుషులతో తమకు ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు.అమ్మను రాత్రి 10 వరకు ఎమ్మెల్యే ఆఫీస్‌లో ఉంచారు..‘‘రాత్రిళ్లు ఎమ్మెల్యే వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి 10 వరకు ఉంచారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతోనే మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అని రేజేటి సౌమ్య కుమారుడు రాహుల్ తెలిపారు.నాన్న పోయిన బాధలో ఉంటే..‘‘మా నాన్న రిటైర్డ్ ఎంఈవో. ఆర్నెల్ల క్రితం మరణించారు. పుట్టెడు శోకంలో ఉన్నాం. మా కుటుంబానికి సౌమ్యనే పెద్ద దిక్కు. ఆమె ఆత్మహత్యాయత్నం కలచివేసింది. అమ్మ హెచ్ఎంగా రిటైరయ్యారు. కుటుంబమంతా బాగా చదువుకుని సెటిల్ అయ్యాం. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు’’ అని సౌమ్య సోదరి, గైనిక్ ప్రొఫెసర్ శిరీష వాపోయారు. -
మరో దారిలేదు.. చావే శరణ్యం
నరసరావుపేట రూరల్: ‘స్కూల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి. ఆ భవనం మాకు ఇచ్చేయండి.’ అంటూ టీడీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూలు మూత పడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు మరో దారి లేదని, చావే శరణ్యమని భావించిన ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది.బాధితుడి భార్య హేమలత తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా, మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పది సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రూ.80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్బో స్కూల్‌ను ప్రారంభించారు. బషీర్, ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల నుంచి పాఠశాలను ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ‘నా భర్త బషీర్‌ను, నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసుకు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలు వారికి అప్పగించి వెళ్లిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితోపాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేం లీజు అగ్రిమెంట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోకుండా శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీనిపై నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు.’ అని హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బషీర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్రల వల్ల 300మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ నేతల వేధింపులపై ఆమె ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బరితెగించిన గంజాయి స్మగ్లర్
నెల్లూరు (క్రైమ్): సినీఫక్కీలో ఓ గంజాయి స్మగ్లర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో కారు వదిలి పరుగుతీశాడు. పోలీసులు వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కారులో 22 కిలోల గంజాయిని నెల్లూరులోని విక్రేతలకు సరఫరా చేసేందుకు తీసుకొస్తున్నాడని సమాచారం అందడంతో బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.సాంబశివరావు తన సిబ్బంది, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌తో కలిసి జాతీయ రహదారిపై కాపు కాశారు. గంజాయి తీసుకొస్తున్న కారును గుర్తించి పెన్నా బ్రిడ్జి అవతలి వైపు నుంచి వెంబడించారు. నిందితుడు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఇద్దరికి గంజాయి ఇచ్చేందుకు కారును స్లో చేశాడు. ఒక్కసారిగా పోలీసులు కారును చుట్టుముట్టగా, గంజాయి తీసుకునేందుకు వచి్చన వ్యక్తులు పారిపోయారు. గంజాయి స్మగ్లర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించి దూసుకువెళ్లాడు. దీంతో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌కు గాయాలయ్యాయి. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు ఆ కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కారు అద్దాలు పగిలిపోయాయి. స్మగ్లర్ ఎన్టీఆర్ నగర్లోకి వెళ్లి అక్కడ కారును వదిలి పారిపోతుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బీరక ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ గా గుర్తించారు. అతని నుంచి కారు, 22 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను జీజీహెచ్‌లో చేర్పించారు.నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నిందితుడు బీరక ప్రకాష్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడని, చాలా ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని వివిధ ప్రాంతాల్లోని విక్రేతలకు సరఫరా చేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిపై నెల్లూరు సంతపేట, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, ఏలూరు ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులో జాకీరాబీ అనే విక్రేతకు గంజాయి సరఫరా చేసేందుకు వచ్చినట్లు తేలింది. ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ నెల్లూరుకు వచ్చి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్‌ను పరామర్శించారు. అనంతరం ఘటనాస్థలాన్ని, నిందితుడు ఉపయోగించిన కారును పరిశీలించారు. -
సిల్క్ సిటీలో 'ఉగ్ర' భయం
ధర్మవరం: పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచి ‘సిల్క్ సిటీ’గా పేరొందిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు బహిర్గతం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ధర్మవరంలోని లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) బృందాలు అప్రమత్తమయ్యాయి. నూర్ మహమ్మద్ ఇంట్లో జరిపిన సోదాల్లో పలు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. సోదాల్లో ఉగ్ర సాహిత్యం పుస్తకాలు కూడా దర్యాప్తు సంస్థల అధికారులకు లభించాయి. అతడు జిహాద్ పేరుతో వాట్సాప్ ద్వారా నిరంతరం సందేశాలు దేశానికి వ్యతిరేకంగా పంపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు నూర్ మహమ్మద్‌ను ఉగ్రవాదులు పావుగా వాడినట్టు తెలుస్తోంది.డబ్బు ఆశ చూపి లొంగదీసుకున్నారా! నూర్ మహమ్మద్ కాయగూరల మార్కెట్ వద్ద చిన్నపాటి హోటల్లో పని చేసేవాడు. అరకొర సంపాదనతో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసేవాడు. రెండేళ్ల క్రితం వరకు కటిక పేదరికం అనుభవించిన అతడు తల్లి, చెల్లితో పాటు భార్య, నలుగురు పిల్లల్ని పోషించేందుకు చాలామంది వద్ద గతంలో చాలా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య సైతం అతనితో గొడవపడి వేరుగా ఉంటోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడన్న ప్రచారం ఉంది. ఏడాది క్రితం వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఇస్తెమాలకు వెళ్లినప్పటి నుంచి నూర్ మహమ్మద్‌లో మార్పు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ముభావంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటివి అతనిలో గమనించినట్టు చెబుతున్నారు. రూ.లక్షలతో ఇల్లు ఆధునికీకరణ పేదరికంలో మగ్గుతూ వచ్చిన నూర్ మహమ్మద్ ఉన్నట్టుండి పాత ఇంటిని రూ.50 లక్షలకు పైగా వెచ్చిoచి ఆధునికీకరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంటి పైపోర్షన్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైన గది నుంచే అర్ధరాత్రి నుంచి సెల్ఫోన్లో గంటల తరబడి మాట్లాడటం చేసేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మరికొందరు అతని దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఉగ్రవాదుల ఆర్థిక సహకారంతోనే సాకారమైనట్టు తెలుస్తోంది. తాడిపత్రిలో ప్రియురాలు నూర్ మహమ్మద్‌తో భార్య వేరుపడినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమెకు సైతం ఉగ్ర సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నూర్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతని ప్రియురాలు అదృశ్యమైనట్టు సమాచారం. నూర్ తరచూ వాట్సాప్‌లో ఆమెతో సంభాషించిన ఆధారాలను కుటుంబ సభ్యులు బహిర్గతం చేశారు. ఆమె పట్టుబడితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.ఇంకా ఎందరుఉన్నారో!ధర్మవరంలోని లోనికోట, లింగశెట్టి పాళ్యం, ఎల్సీకే పురంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రజలు పాతబస్తీగా పిలుస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యాకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే నివసిస్తుంటారు. ఇక్కడ తక్కువ అద్దెకు ఇల్లు దొరకడం, మాస్ బెల్ట్ కావడంతో పేద, మధ్య తరగతి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో నూర్ మహమ్మద్‌తో పాటు ఉగ్ర సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎందరు ఉన్నారని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. స్థానికతతో పాటు ఎలాంటి ఆధారమూ లేకుండా ఉండేవారు ఎందరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఎల్సీకే పురానికి చెందిన ఆటో డ్రైవర్ రియాజ్ తన వాట్సాప్ స్టేటస్‌లో ‘నో ఇండియా.. ఐ లవ్ పాకిస్థాన్’ అనే సందేశాన్ని పెట్టడంతో అతన్ని కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఒకేరోజు నూర్ మహమ్మద్‌తో పాటు రియాజ్ వ్యవహారం బట్టబయలు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో ఉగ్ర మూకల్ని కూకటి వేళ్లతో పెకలించాలని ప్రజలు కోరుతున్నారు. ఉగ్ర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక బృందాలు పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రత్న తెలిపారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారం మేరకు ధర్మవరం పోలీసులు ఉగ్రవాద భావాజాలాన్ని అరికట్టే క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారన్నారు. ఈ క్రమంలోనే ఆరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలులుండి.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ, జిహాదీ సిద్ధాంత పుస్తకాలు కలిగిన నూర్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం ఉన్నట్టు నూర్ మహమ్మద్ అంగీకరించాడని తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి, దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణ జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాది నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులు, జిహాదీ భావజాలం, ఉగ్రవాద సంస్థల ప్రచారంతో కూడిన నిషేధిత సాహిత్యం గల పుస్తకాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. అతడి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక ఇచి్చన వెంటనే ఇతరులతో సంబంధాలు, ఉగ్ర లింకులు తదితర వివరాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట ధర్మవరం ఇన్చార్జి డీఎస్పీ నరశింగప్ప, టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
రూ.12 కోట్ల విలువైన బంగారందోపిడీ కేసులో దొంగ అరెస్ట్
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్‌లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్‌కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్‌ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్‌పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్ లాకర్ డోర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొత్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అనుమతితో పన్వార్‌ను కస్టడీకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ పరార్
ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్ రఫీ అనే అంతర్ జిల్లా దొంగ, వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం. తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్ అమర్ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్ బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది. ప్రహరీ చుట్టూ విద్యుత్ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది. -
‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్‌చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్‌కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్‌గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్‌తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్‌తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు. యువకుడి మరణంతో ఉద్రిక్తత కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్‌లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యతి్నంచారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. మృతదేహం అడ్డగింత కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్‌కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయతి్నంచారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. -
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్‌కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్‌కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
తండ్రి డబ్బులివ్వలేదని కుమార్తె కిడ్నాప్!
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు.. మువ్వావారిపాలేనికి చెందిన కె.శ్రీనివాసరావు కుమార్తె చీమకుర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తిరుపతికి చెందిన ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను బయటకు పిలిపించాడు. తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తే కావడంతో.. ఈశ్వర్‌రెడ్డి మాయమాటలు నమ్మిన బాలిక అతని బైక్ ఎక్కింది. అనంతరం తిరుపతి వైపు బయలుదేరిన ఈశ్వర్‌రెడ్డి.. కొద్దిసేపటికి బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనందున.. నీ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక తండ్రి చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సుబ్బారావు వెంటనే కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను కావలి–నెల్లూరు మధ్యలో అదుపులోకి తీసుకొని.. బాలికను రక్షించారు. -
నా కుమారుడిని మంత్రి అనుచరులే పొట్టనపెట్టుకున్నారు..
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల వల్లే తన కుమారుడు వడ్డే సునీల్(24) చనిపోయాడంటూ తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. గురువారం సాయంత్రం తన కుమారుడిని ఇష్టానుసారం కొట్టి చంపేసి.. చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, నారాయణప్ప దంపతుల కుమారుడు సునీల్.. నెల నుంచి కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్న స్థితిలో సునీల్ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి నారాయణప్ప ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. సునీల్ రొద్దం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను వేధించేవాడని, ఈ క్రమంలో ఆమె సమీప బంధువైన విట్టాపల్లికి చెందిన ఓ వ్యక్తి కలగజేసుకుని పరిగికి చెందిన వ్యక్తితో ఈ విషయంపై చర్చించాడని, దీంతో పరిగికి చెందిన వ్యక్తి గురువారం సాయంత్రం సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఎదుటే మందలించాడని, దీన్ని అవమానంగా భావించిన అతను గురువారం సాయంత్రమే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చెప్పారు. కాగా, సునీల్తల్లి లక్ష్మీదేవి మాత్రం కియా పరిశ్రమలో డ్యూటీకి వెళ్లిన తన కుమారుడు ఇలా ఉరి వేసుకునేంత తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి అనుచరుడు చంద్ర ఇంటి వద్దకు వచ్చి తన కుమారుడిని మందలించాడని, ఆ తర్వాత మరికొందరు కలసి ఇష్టానుసారం కొట్టారని ఆమె తెలిపారు. తన కుమారుడి చావుకు మంత్రి అనుచరులే కారణమని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని విన్నవించారు. -
ఆళ్లగడ్డలో ఢీకొన్న రెండు బస్సులు.. పలువురు మృతి
సాక్షి, ఆళ్లగడ్డ: నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెట్స్ బస్సులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మార్గ మధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, మరో ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అజ్ఞాతంలోనే హతం
ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురానికి చెందిన మావోయిస్టు సుగులూరి చిన్నన్న (57) మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చిన్నన్నకు భవనాశి శంకర్, విజయ్ అనే మారుపేర్లు ఉన్నాయి. చిన్నన్న కర్నూలు జిల్లా వేంపెంట ఘటనతోపాటు కరువు దాడులు, సినిమా థియేటర్ల పేల్చివేత, వాహనం దహనం, సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత తదితర ఘటనల్లో నిందితుడిగా రికార్డులకెక్కారు. చిన్నన్న 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చిన్నన్న అజ్ఞాతంలోకి వెళ్లే నాటికి అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు క్రాంతి, రామకృష్ణ ఉన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్‌కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బస్సు స్పీడ్‌గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్‌ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్‌గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షిడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
కడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్‌కుమార్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్‌దొర, పూసం పవన్ కుమార్‌లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్‌పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్‌పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాç³ర్లు కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి, మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు. -
సై'డర్'..!
మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్‌టైం జాబ్‌ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్‌లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్‌లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్‌లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్‌గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్‌గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్‌ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్‌తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్‌తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్‌ను కూడా వెరిఫికేషన్‌లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్‌టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్‌టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్‌్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్‌్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్‌డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్‌ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్‌డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్‌లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్ -
ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్‌లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్‌రెడ్డి, ఆర్ఎస్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్‌తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
కన్నతల్లిని కత్తితో నరికి హత్యాయత్నం
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుల నిరసన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్‌కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్‌ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు. -
ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..
జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ టి.బాబూరావు తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్‌లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్‌కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.