జమ్మలమడుగు : ‘పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం కాదు. నిజంగా నీలో సత్తా ఉంటే మీ మూడు పార్టీలే కాదు మరికొన్ని పార్టీలను కలుపుకొని రా, నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగనివ్వు, ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం జమ్మలమడుగులో నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆదినారాయణరెడ్డి పులివెందుల టార్గెట్ అంటున్నాడు, గతంలో పులివెందులలో డీఐజీ, ఎస్పీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసి గ్రామాల్లో ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా.. బయటి ప్రాంతాల వారితో ఓట్లు వేయించుకున్న వాడివి, నీవు వైఎస్ జగన్ గురించి పులివెందులలో తమ ప్రతాపం చూపిస్తా అని మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఏమిటో ముందు తెలుసుకో. పోలీసులు ఉంటేనే బయటికి, పులివెందులకు పోయే పరిస్థితి. వారు లేకుండా పూల అంగళ్లు కూడా దాటలేని పరిస్థితి నీది’ అంటూ చురకలు అంటించారు. ఇప్పుడు ఎన్నికల్లో జమ్మలమడుగు మున్సిపాలిటీ గెలిచి చూడు నీవేంటో తెలుస్తుందన్నారు. ‘ఆదినారాయణరెడ్డి.. ఇప్పటికై నా మారు నీ స్థితి ఏమిటో అర్థం చేసుకుని మసలుకో. వయసు మీద పడుతుంది. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకో’ అని హితవు పలికారు. రాబోయే 30 ఏళ్ల పాటు అధికారంలో కూటమి ఉంటుందని ప్రగల్భాలు చెబుతున్నావు. 2029లో జరిగే ఎన్నికల్లో మీ కూటమే కాకుండా ఇంకా ఎవరినైనా కలుపుకొని వచ్చినా జమ్మలమడుగు, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం’ అని అన్నారు.
దమ్ము ఉంటే నిష్పక్షపాతంగా
ఎన్నికలు జరగనివ్వు
ఆదినారాయణరెడ్డికి
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సవాల్


