సేవలలో మొదటి స్థానం | - | Sakshi
Sakshi News home page

సేవలలో మొదటి స్థానం

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

కడప రూరల్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సర్వీసెస్‌ డెలివరీ(సేవలను ప్రజలకు అందించడం)లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ ఏడాది జులైలో 81.48 శాతం, ఆగస్టు లో 81.59 శాతం సాధించి వరుసగా రెండు నెలలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్‌ వైద్య సిబ్బందిని అభినందించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

కడప సిటీ : తిరుమలలో ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాహన సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాల్సిందిగా కడపకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, ప్రవచనకర్త డాక్టర్‌ ఐఎల్‌ఎన్‌ చంద్రశేఖరరావుకు టీటీడీ అధికారులు ఆహ్వానం పంపారు. పెండ్లిమర్రి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడైన ఆయన, ఈ నెల 15న పెద్దశేష వాహనం, 16న చిన్నశేష వాహన సేవలకు మాడ వీధుల్లో టీటీడీ ధర్మప్రచార పరిషత్‌ తరఫున వ్యాఖ్యానం చేయనున్నారు. అలాగే 21న జరిగే స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహన సేవలకు ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష వ్యాఖ్యానం అందించనున్నారు.

రిమ్స్‌లో 50 పడకల

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభం

కడప అర్బన్‌: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. రిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఈ బ్లాక్‌ను కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆర్‌. మాధవి రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అత్యవసర, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అధునాతన చికిత్స అందించేందుకు ఈ బ్లాక్‌ ఎంతో ఉపయోగపడుతుందని, కడప జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోనల్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్‌.శ్రీనివాసుల రెడ్డి, రిమ్స్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.విజయభాస్కర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.పెంచలయ్య, అడ్మినిస్ట్రేటర్‌ యు.రంగస్వామి, ఏపిఎంఎస్‌ఐడిసీ ఈఈ చంద్రమౌళి పాల్గొన్నారు.

నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

కడప అర్బన్‌ : కడప నగరంలోని ఓ ప్రధాన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఓ ప్రదేశంలో పేకాడుతున్న వారిలో నలుగురు కానిస్టేబుల్స్‌ పట్టుబడ్డారు. పేకాట ఆడుతుండగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ సీఐకి సమాచారం వచ్చింది. ఆయన తమ సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. అందులో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌, ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉన్నారు. వారిని అరెస్ట్‌ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

గల్ఫ్‌ కార్మికుల సహాయ

కేంద్రం ప్రారంభం

కడప కార్పొరేషన్‌: జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గల్ఫ్‌ కార్మికుల సహాయ కేంద్రం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని కడప వన్‌టౌన్‌ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గల హీరో షోరూం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గల్ఫ్‌ కార్మికుల సహాయ కేంద్రాన్ని (గల్ఫ్‌ వలసదారుల వనరుల కేంద్రం) ఆయన ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేక ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారిని రక్షించేందుకు, సురక్షిత వలసలను ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్‌ వెళ్లే వారికి అక్కడి నియమాలు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వీసా, పాస్‌పోర్ట్‌, కాంట్రాక్ట్‌ పత్రాల పరిశీలన, వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కడప అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రీనివాసులు, డీఎల్‌ఎస్‌ఏ మెంబర్‌ కె.ప్రభాకర్‌, ఎన్‌డబ్ల్యూడబ్ల్యూటీ చైర్‌పర్సన్‌ లిస్సి జోసెఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement