కడప సిటీ : ఉద్యానవన పంటలను ప్రోత్సహించి రైతులకు అండగా నిలవాల్సిన ఉపాధి హామీ అనుసంధాన పండ్ల తోటల పెంపకం పథకం కఠినమైన నిబంధనలు, షరతుల కారణంతో అటకెక్కుతోంది. ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (వీబీజీ రామ్‌జీ) పథకం అమలులోకి వచ్చింది. ఈ కొత్త పథకంలో పండ్ల తోటలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కఠిన షరతులు విధించారు. ఈ కఠిన నిబంధనల వల్ల ఉద్యానవన అభివృద్ధి జిల్లాలో కష్టతరంగా మారింది. ఒకవైపు జిల్లాను తీవ్రంగా వేధిస్తున్న ఎల్‌నినో ప్రభావం, మరోవైపు పథకంలోని సవరించిన నిబంధనల వల్ల తోటల పెంపకానికి రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రైతులను ఎంత ఒత్తిడి చేసినా, గ్రామాల్లో ‘మొక్కలు కావాలా... రైతన్నా!‘ అని దండోరా వేయిస్తున్నా అన్నదాతలు ముందుకు రావడం లేదు. దీంతో నిర్దేశిత వార్షిక సాగు లక్ష్యాలను చేరుకోలేక ఉద్యానవన, డ్వామా అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్థిక భారం తప్పించుకునేందుకే
‘కనిష్ట’ పరిమితి?
ఈ పథకం నిధుల ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా భారాన్ని తగ్గించుకోవడానికి, కూటమి ప్రభుత్వం తనపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను కఠినతరం చేసి, సాగు విస్తీర్ణాన్ని తగ్గించడానికి కారణమవుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఈ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు ఉద్యాన పంటల సాగుకు లబ్ధి చేకూర్చేవారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 0.25 ఎకరం నుండి గరిష్ఠంగా 2.5 ఎకరాలకు (సగానికి) కుదించారు. పెట్టుబడి మరియు రుణ సౌకర్యాన్ని కూడా గరిష్ఠంగా రూ. 4 లక్షల వరకే పరిమితం చేశారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, లేబర్ ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని రైతులు పెదవి విరుస్తున్నారు.
గతానికి భిన్నంగా..
మిగిలిన భూమికి నో పర్మిషన్
గతంలో ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి ఎకరాకు రూ.1.30 లక్షలు అందించేవారు. అప్పట్లో రైతుకు ఐదు ఎకరాల భూమి ఉండి, అందులో రెండు ఎకరాలకు ఉద్యాన పంటల పెంపకానికి లబ్ధి పొందినప్పటికీ.. మళ్లీ మిగిలిన రెండున్నర ఎకరాల్లో కూడా పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం (విడతల వారీగా) ఉండేది. కానీ ప్రస్తుతం అమలవుతున్న వీబీజీ రామ్‌జీ పథకంలో ఈ పరిస్థితి లేదు. ఇందులో అత్యంత విచిత్రమైన నిబంధన ఏమిటంటే.. ఒక రైతు ఒకసారి దరఖాస్తు చేసుకుని పండ్ల తోటలు వేసుకుంటే, ఆ తర్వాత అతనికి ఇంకా సొంత భూమి మిగిలి ఉన్నప్పటికీ, అందులో తిరిగి పండ్ల తోటల పెంపకానికి అనుమతి నిరాకరించేలా నిబంధనలు రూపొందించారు.
ఎల్‌నినో ముప్పు.. అధికారుల నిస్సహాయత
షరతులు ఒకవైపు కోకొల్లుగా ఉంటే, మరోవైపు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి బోర్లు ఎండిపోతున్నాయి. తీవ్రమైన వర్షాభావం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా తోటలకు నీళ్లు పోసే పరిస్థితి లేదని, ఎక్కడ ఇబ్బందులు పడి అప్పులపాలవుతామన్న ఆలోచనతో రైతులు ముందుకు రావడం లేదు. ప్రతి మండలంలో ఇంత విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేయించాలంటూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలను విధించారు. అయితే, రైతుల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో టార్గెట్లు పూర్తి చేయలేక ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారు.
వీబీజీ రామ్‌జీలో షరతులెన్నో!
ఆర్థిక భారం తప్పించుకునేందుకు ప్రభుత్వ ఎత్తుగడ
ఎల్‌నినో భయంతో రైతుల వెనకడుగు
సాగు విస్తీర్ణం 5 ఎకరాల నుంచి
2.5 ఎకరాలకు కుదింపు
రుణ సౌకర్యం రూ.4 లక్షలకే పరిమితం
లక్ష్యాలు పూర్తి కాక అధికారుల అగచాట్లు
క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తాం!
ప్రస్తుతం వీబీజీ రామ్‌జీ పథకం ద్వారానే పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు తీసుకుంటున్నాం. అయితే, ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగు చేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నది వాస్తవమే. ఈ పథకంలో ఒకసారి ప్రయోజనం పొంది, ఒకవేళ నీళ్లు లేని పరిస్థితి దాపురించి ఉద్యాన పంటలు కాపాడుకోలేకపోతే.. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు అవకాశం ఉండదు. ఈ నిబంధనల వల్ల రైతులు వెనుకంజ వేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిల్లో రైతుల్లో అవగాహన పెంచి ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– బి.ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప


