కడప అర్బన్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ నెల 12న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ‘జాతీయ లోక్ అదాలత్‘నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 8, ప్రొద్దుటూరు 5, రాజంపేట 3, రాయచోటి 3, బద్వేల్ 2, సిద్దవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వేకోడూరులో ఒక్కొక్క బెంచ్ చొప్పున ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్: 08562 258622, 244622.. ఈ మెయిల్ అడ్రస్: కెఎడిఎపిఎ.డికోర్ట్స్.జిఒవి.ఐఎన్, డిఎల్‌ఎస్‌ఎకెడిపిఅట్‌దిడేటాఫ్‌డాట్‌కామ్. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చును. న్యాయవాదులు, రెవెన్యూ, బ్యాంక్, ఇన్సూరెన్స్, లేబర్ డిపార్ట్‌మెంట్, రవాణా, పోలీసు శాఖతోపాటు ఇతర శాఖల అధికారులు, చిట్ ఫండ్ కంపెనీ ప్రతినిధులు జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.రామగోపాల్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఫకృద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.


