అందరూ ఉన్నా.. అనాథలా..! | - | Sakshi
Sakshi News home page

అందరూ ఉన్నా.. అనాథలా..!

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

కడప అర్బన్‌ : ‘ఆమెకు అందరూ ఉన్నారు.. కానీ అనాథగానే’ ఈ లోకం విడిచిపోయింది. కడ చూపునకు బంధువులు వచ్చినా.. ఈపింటి వాళ్లం, కొన్ని సంప్రదాయాలు చేయకూడదు అని తప్పించుకున్నారు. చివరకు ఓ బంధువు శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిని సంప్రదించగా.. వారు హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భర్త, ఇద్దరు కుమారులు ఉన్నా.. వారు కార్యం నిర్వహణకు ముందుకు రాలేదు. దీంతో ఆత్మ బంధువులు అయిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంత్యక్రియల తతంగం పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు వాస్తవ్యులు జయకుమార్‌ సతీమణి రాధమ్మ (55) గత 24 సంవత్సరాల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల భర్తతో విడిపోయారు. అనంతరం కడపలో ఉన్న తన తల్లి దగ్గర ఉన్నారు. తల్లి మరణించిన తర్వాత అక్క, బావ చేరదీసినట్లే చేరదీసి, తరువాత కడప నగరంలోని చౌడమ్మ వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకొన్నారు. రాధమ్మ గత 12 ఏళ్లుగా చౌడమ్మ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.

భర్త, కుమారుడు వచ్చినా...

రాధమ్మకు భర్త, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన ఇద్దరు కుమారులు ఉన్నారు. చివరి చూపు చూసేందుకు భర్త, ఓ కుమారుడు వచ్చినా, అంతిమ సంస్కారాలు నిర్వహించలేదు. బంధువర్గం పెద్దది. అయితే వారిలో 20 మంది దాకా బంధువులు చివరి చూపు చూసేందుకు వచ్చారు. కానీ అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కడపలో ఉన్న ఆమె బంధువులలో ఒకరు ఫోన్‌ ద్వారా శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిని సంప్రదించి రాధమ్మ గురించి వివరాలను తెలిపి, అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. వెంటనే శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి వారు స్పందించారు. మానవత్వంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అందరూ బంధువులే కానీ.. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె దహన సంస్కారాలు అనాథగా నిర్వహించాల్సి వచ్చిందని సంస్థ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంప్రదాయాలు ఈపింటి వాళ్లం చేయకూడదు అనే మాటలు వారి నుంచి రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో ఆర్టీసీ కానిస్టేబుల్‌ గుండ్లకొండ రవి, రెడ్డి లక్ష్మణ్‌, బద్రి, పుట్టా పురుషోత్తం, హరిబాబు, ఎలక్ట్రిషన్‌ మధు, సివిల్‌ సప్లయ్‌ సురేష్‌ పాల్గొన్నారు.

చివరి చూపునకు వచ్చిన బంధువులు

ఈపింటి వాళ్లమని అంత్యక్రియలకు దూరం

’ఆత్మ బంధువులచే’ అంతిమ సంస్కారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement