ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. సభా అనుజ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసుదాసు పుణ్యాహవాచకం, రక్షాబంధనం, ఆచార్య రుత్విక్ వరణం, పవిత్ర పుట్ట మన్ను సమర్పణ, అంకురార్పణ, వాస్తుహోమం, సోమకుంభ ప్రతిష్ఠ, కలశారాధన, నివేదన, సేవాకాలం, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ ఏఈవో రవి మాట్లాడుతూ శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజుల పాటు రామయ్య క్షేత్రంలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహిస్తామని చెప్పారు.
బ్రెజిల్ దేశస్తుల సందడి
ఒంటిమిట్ట పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతున్న వేళ.. బ్రెజిల్ దేశస్తులు సందడి చేశారు. తీర్థ యాత్రలో భాగంగా వారు రామేశ్వరం, హంపి తదితర ప్రాంతాలతోపాటు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామా లయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గర్భాలయంలోని మూల మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాసేపు అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు.


